ఇంగ్లండ్‌కు పయనమైన టీమిండియా.. యువ కెరటాలతో కదిలిన గంభీర్!

ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ కోసం టీమిండియా ఇంగ్లండ్ పయనమైంది. గౌతమ్ గంభీర్ నేతృత్వంలోని భారత యువ జట్టు ముంబై ఎయిర్‌పోర్ట్ నుంచి శుక్రవారం బయల్దేరింది. వరల్డ్ టెస్టు ఛాంపియన్ షిప్ 2025-27లో టీమిండియా ఆడనున్న తొలి సిరీస్ ఇదే. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి రిటైర్మెంట్ తర్వాత టీమిండియా పాల్గొనున్న సిరీస్ కూడా ఇదే మొదటిది. జూన్ నుంచి ఆగస్టు వరకు కొనసాగే ఈ సిరీస్ చాలా ఆసక్తికరంగా మారనుంది. ఈ టెస్టు సిరీస్‌కు టెండూల్కర్ - అండర్సన్ ట్రోఫీగా నామకరణం చేశారు.

రవిచంద్రన్ అశ్విన్, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి టెస్టు క్రికెట్ నుంచి రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత టీమిండియా ఆడనున్న మొదటి టెస్టు సిరీస్ ఇదే. కెప్టెన్ రోహిత్ రిటైర్మెంట్‌తో యువ ఆటగాడు శుభమన్ గిల్‌కు టీమిండియా సారథ్య పగ్గాలు అప్పగించారు. ఇందులో సాయి సుదర్శన్, అభిమన్యు ఈశ్వరన్, నితీష్ కుమార్ రెడ్డి, అర్షదీప్ సింగ్, ధృవ్ జురెల్ లాంటి యువకులతో పాటు కరుణ్ నాయర్‌కు బీసీసీఐ అవకాశం కల్పించింది.

ఇంగ్లండ్‌లో శుక్రవారం అడుగుపెట్టనున్న టీమిండియా జూన్ 20 నుంచి టెస్టు సిరీస్ ఆడనుంది. లీడ్స్, ఎడ్జ్‌బాస్టన్, లార్డ్స్, ది ఒవెల్, ఓల్డ్ ట్రాఫర్డ్ పిచ్‌లపై ఇంగ్లండ్-భారత్ జట్లు తలపడనున్నాయి. జూన్ 20తో ప్రారంభమయ్యే ఈ టెస్టు సిరీస్ ఆగస్టు 4తో ముగియనుంది. రెండు నెలల పాటు జరిగే ఈ సిరీస్‌ భారత్‌కు చాలా కీలకమని చెప్పొచ్చు.

ఈ సిరీస్ కోసం చాలా మంది ఆటగాళ్లు ముందుగానే ఇంగ్లండ్ చేరుకున్నారు. యశస్వి జైస్వాల్, అభిమన్యు ఈశ్వరన్, ధృవ్ జురెల్, కరుణ్ నాయర్, నితీష్ కుమార్ రెడ్డితో పాటు బౌలర్లు కూడా ఇంగ్లండ్ చేరుకుని అక్కడ అనధికారిక టెస్టు సిరీస్‌లు ఆడుతున్నారు. ఇండియా ఏ - ఇంగ్లండ్ లయన్స్ మధ్య రెండు అనధికారిక టెస్టు సిరీస్‌లకు ఈసీబీ, బీసీసీఐ షెడ్యూల్ ఖరారు చేసింది. మొదటి టెస్టు మ్యాచ్ డ్రా కాగా.. రెండో మ్యాచ్ ఈ రోజు ప్రారంభం కానుంది. రెండో టెస్టు మ్యాచ్ అనంతరం భారత్, భారత్ ఏ మధ్య ఒక మ్యాచ్ జరగనుంది.

ఇంగ్లండ్ కూడా భారత్‌తో జరిగే టెస్టు సిరీస్ కోసం తొలి టెస్టు మ్యాచ్‌కి స్క్వాడ్‌ని ప్రకటించింది. గతంలో భారత్ వేదికగా జరిగిన దైపాక్షిక టెస్టు సిరీస్‌లో ఇంగ్లండ్ 4-1 తేడాతో ఘోరంగా ఓడిపోయింది. దాంతో ఈ సిరీస్‌లో ఎలాగైనా రివేంజ్ తీర్చుకోవాలని ఇంగ్లండ్ జట్టు చూస్తోంది.

టీమిండియా టెస్టు స్క్వాడ్

శుభమన్ గిల్ (కెప్టెన్), రిషబ్ పంత్ (వైస్ కెప్టెన్), యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్, సాయి సుదర్శన్, అభిమన్యు ఈశ్వరన్, కరుణ్ నాయర్, నితీష్ కుమార్ రెడ్డి, రవీంద్ర జడేజా, ధృవ్ జురెల్, వాసింగ్టన్ సుందర్, శార్థూల్ ఠాకూర్, జస్ప్రిత్ బుమ్రా, మహమ్మద్ సిరాజ్, ప్రసిద్ కృష్ణ, ఆకాశ్ దీప్, అర్షదీప్ సింగ్, కుల్దీప్ యాదవ్.

మొదటి టెస్టుకు ఇంగ్లండ్ స్క్వాడ్

బెన్ స్టోక్స్ (కెప్టెన్), షోయబ్ బషీర్, జాకబ్ బేతెల్, హ్యారీ బ్రూక్, బ్రైడన్ కార్స్, సామ్ కుక్, జాక్ క్రాలీ, బెన్ డకెట్, జెమీ ఓవర్టన్, ఓలీ పోప్, జో రూట్, జెమీ స్మిత్, జాస్ టంగ్, క్రిస్ ఓక్స్.

2025-06-06T05:12:40Z