ఇంగ్లాండ్‌తో తొలి టెస్టుకు ముందు టీమిండియాకు షాక్.. స్టార్ ప్లేయర్‌కు గాయం!

ఇంగ్లాండ్‌తో ఐదు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో తలపడేందుకు భారత క్రికెట్ జట్టు సన్నద్ధమైంది. ఈ సిరీస్ శుభ్‌మన్ గిల్ నాయకత్వంలో భారత క్రికెట్‌లో కొత్త శకానికి నాంది పలుకనుంది. రోహిత్ శర్మ రిటైర్మెంట్ తర్వాత 25 ఏళ్ల గిల్‌ టీమిండియా సారథిగా నియమితుడయ్యాడు. ఇక గిల్ సారథ్యంలో భారత జట్టు ఇప్పటికే ఇంగ్లాండ్ గడ్డపై అడుగుపెట్టింది. ముమ్మరంగా సాధన చేస్తోంది. ఈ క్రమంలోనే కీలక ఆటగాడు గాయపడటం భారత్‌ను కలవరపెడుతోంది.

ప్రాక్టీస్‌లో గాయపడ్డ పంత్..

ఇంగ్లాండ్‌తో తొలి టెస్టుకు ముందు టీమిండియా వైస్ కెప్టెన్ రిషభ్ పంత్ గాయపడ్డట్లు తెలుస్తోంది. ప్రాక్టీస్ సందర్భంగా అతడి ఎడమ చేతికి గాయమైటన్లు సమాచారం. దీంతో భారత శిబిరంలో ఒక్కసారిగా ఆందోళన మొదలైంది. అయితే పంత్‌ను పరీక్షించిన వైద్యులు.. గాయం తీవ్రత తక్కువగానే ఉన్నట్లు నిర్ధారించారట. దీంతో ఒకటి, రెండు రోజులు విశ్రాంతి తీసుకుని పంత్ తిరిగి ప్రాక్టీస్ ప్రారంభించనున్నట్లు తెలుస్తోంది.

ప్రాక్టీస్ గేమ్‌లో సత్తాచాటిన కేఎల్ రాహుల్..

ఇంగ్లాండ్‌తో టెస్టు సిరీస్‌కు పూర్తిస్థాయిలో ప్రిపేర్ అయ్యేందుకు లండన్‌కు ముందే వెళ్లాడు రాహుల్. అనుకున్నట్లుగానే ఇండియా ఏ, ఇంగ్లాండ్ లయన్స్ మధ్య జరుగుతున్న రెండో అనధికారిక టెస్టులో బరిలోకి దిగాడు. ఇందులో తొలి ఇన్నింగ్స్‌లో సెంచరీ కొట్టిన ఈ ప్లేయర్.. రెండో ఇన్నింగ్స్‌లో హాఫ్ సెంచరీతో రాణించాడు. దీంతో కీలకమైన సిరీస్‌కు ముందు ఫామ్‌లోకి వచ్చాడు.

కేఎల్ రాహుల్ బ్యాటింగ్ పొజిషన్ ఎక్కడ?

ఇక తొలి టెస్టులో భారత జట్టు కూర్పు ఎలా ఉంటుందనేది ఆసక్తికరంగా మారింది. రోహిత్ శర్మ దూరం కావడంతో జైశ్వాల్‌కు తోడుగా ఇన్నింగ్స్ ఎవరు ప్రారంభిస్తారనేది తేలాల్సి ఉంది. ఆ ప్లేస్‌కు రాహుల్ సరిగ్గా సెట్ అవుతాడనే అంచనాలు ఉన్నాయి. కానీ సాయి సుదర్శన్‌, గిల్‌లు కూడా ఓపెనింగ్ ప్లేసు కోసం పోటీలో ఉన్నారు. ఒకవేళ రాహుల్ ఓపెనర్‌గా బరిలోకి దిగితే.. గిల్ మూడు, కరుణ్ నాయర్ నాలుగో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చే అవకాశం ఉంది. అప్పుడు సాయి సుదర్శన్‌ బెంచ్‌పై కూర్చోవాల్సి ఉంటుంది. జూన్ 20 నుంచి తొలి టెస్టు ప్రారంభం కానుంది.

2025-06-09T14:11:13Z