ఆసియా హమారా

  • లంకపై భారత్‌ ఘనవిజయం.. 8వసారి కప్‌ కైవసం
  • సిరాజ్‌ సునామీ
  • 50 పరుగులకే శ్రీలంక ఆలౌట్‌ భారత్‌ జయభేరి
  • ఎనిమిదోసారి ఆసియాకప్‌ కైవసం
  • నిప్పులు చెరిగిన హైదరాబాదీ పేసర్‌

బంతి బంతికి లంకేయులను బెంబేలెత్తించిన హైదరాబాదీ పేసర్‌ మహమ్మద్‌ సిరాజ్‌.. ఒంటిచేత్తో టీమ్‌ఇండియాకు ఆసియాకప్‌ అందించాడు. భారత్‌, శ్రీలంక మధ్య కొలంబో వేదికగా ఆదివారం జరిగిన ఫైనల్లో పరుగుల వరద ఖాయమని భావిస్తే.. సిరాజ్‌ దాన్ని వికెట్ల వానగా మార్చేశాడు. ఒకే ఓవర్లో నాలుగు వికెట్లు సహా మొత్తం ఆరుగురు లంకేయులను పెవిలియన్‌ చేర్చి వార్‌ వన్‌సైడ్‌ చేశాడు. ఫలితంగా భారత్‌ ఎనిమిదోసారి ఆసియాకప్‌ను ముద్దాడింది.

-వివరాలు ఆట పేజీలో..

వాటన్నింటినీ పంటి బిగువున భరించిన

ఈ హైదరాబాదీ పేసర్‌ ఆసియాకప్‌ ఫైనల్లో లంకను అల్లాడించాడు. అసలు అతడు

వేస్తున్నది క్రికెట్‌ బాలా లేక అగ్నిగోళమా అన్నట్లు నిప్పులు చెరుగుతూ ఆరు వికెట్లతో అదుర్స్‌ అనిపించాడు. వరుణుడి ప్రభావంతో కళ తప్పిన ఆసియాకప్‌నకు అద్భుత ముగింపునిస్తూ.. ప్రేమదాస స్టేడియంలో వికెట్ల సునామీ సృష్టించాడు.

‘బాల్‌ బాల్‌ బచ్‌గయా’అన్నట్లు ప్రతి బంతికి ఓ యమగండాన్ని ఎదుర్కొన్న లంకేయులు చివరకు 50 పరుగులకే ఆలౌట్‌ కాగా.. స్వల్ప లక్ష్యాన్ని చూస్తుండగానే ఛేదించిన టీమ్‌ఇండియా ఎనిమిదోసారిఆసియాకప్‌ను ముద్దాడి.. వన్డే ప్రపంచకప్‌నకు ముందు ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించుకుంది!

టెస్టు క్రికెటర్‌ను తీసుకొచ్చి వన్డేల్లో బౌలింగ్‌ చేయిస్తున్నారని ఒకరు.. అటు పేస్‌ లేదు.. ఇటు స్వింగ్‌ లేదు అలాంటి వాడు అవసరమా అని మరొకరు..ధారాళంగా పరుగులిచ్చుకోవడం తప్ప అతడు చేసేదేముండదని ఇంకొకరు..

ఇలా సిరాజ్‌పై వచ్చినన్ని విమర్శలు మరే భారత పేసర్‌పై వచ్చి ఉండువు!

శ్రీలంకతో చివరిసారి ఆడిన మ్యాచ్‌లోనూ దాదాపు ఇలాంటి పరిస్థితే ఎదురైంది. అప్పుడు తొలి నాలుగు వికెట్లు పడగొట్టినా ఐదో వికెట్‌ దక్కలేదు. నేను విధి రాతను నమ్ముతా. లైన్‌ అండ్‌ లెంగ్త్‌కు కట్టుబడి ఉంటే.. వికెట్లు దక్కుతాయని అనుకున్నా. దానికి తగ్గట్లే బంతిని నియంత్రించా. కొత్త బంతితో స్వింగ్‌ రాబట్టడం నాకు ఇష్టం. బ్యాటర్లను షాట్లు ఆడేందుకు ఉసిగొల్పి వికెట్లు చేజిక్కించుకున్నా. ఔట్‌ స్వింగ్‌తో వికెట్లు పడగొట్టడం చాలా ఆనందంగా ఉంది.

-సిరాజ్‌

దిల్‌ జీత్‌లియా

ఆసియాకప్‌ ఫైనల్లో తనకు దక్కిన మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ అవార్డుతోపాటు నగదు బహుమతిని మైదాన సిబ్బందికి అందిస్తున్నట్లు సిరాజ్‌ ప్రకటించాడు. క్లిష్ట పరిస్థితుల్లో గ్రౌండ్‌ స్టాఫ్‌ కష్టం వల్లే ఈ టోర్నీ సాధ్యమైందని ఈ తెలంగాణపేసర్‌ వెల్లడించాడు.

గ్రౌండ్స్‌మెన్‌కు భారీ నజరానా

భారీ వర్షాల మధ్య సాగిన ఆసియాకప్‌లో మ్యాచ్‌ల నిర్వహణ కష్టతరమైనా.. ఏమాత్రం వెనక్కి తగ్గకుండా అహర్నిశలు శ్రమించిన గ్రౌండ్స్‌మెన్‌కు భారీ నజరానా దక్కింది. ఆసియా క్రికెట్‌ కౌన్సిల్‌, శ్రీలంక క్రికెట్‌ తరఫున.. క్యూరేటర్లు, గ్రౌండ్స్‌మెన్‌కు రూ.41.54 లక్షల చెక్కు అందజేశారు.

రెండు కంటే ఎక్కువ దేశాలు పాల్గొన్న టోర్నీలో భారత జట్టు ట్రోఫీ చేజిక్కించుకోవడం ఐదేండ్ల తర్వాత ఇదే ప్రథమం. గతంలో 2018లో ఆసియాకప్‌ నెగ్గిన తర్వాత టీమ్‌ఇండియాకు ఇదే మొదటి టైటిల్‌.

కొలంబో: ఐదేండ్లుగా ఏ ఒక్క మేజర్‌ టోర్నీ కూడా నెగ్గని భారత జట్టుకు తెలంగాణ పేసర్‌ మహమ్మద్‌ సిరాజ్‌ ఒంటి చేత్తో ఆసియాకప్‌ ట్రోఫీ అందించాడు. ఒకే ఓవర్‌లో నాలుగు వికెట్లు సహా మొత్తం ఆరుగురు లంకేయులను పెవలియన్‌ బాట పట్టించి సిక్సర్‌ నమోదు చేసుకున్నాడు. మిగిలిన పేసర్లు కూడా తలో చేయి వేయడంతో ఆదివారం జరిగిన ఆసియాకప్‌ ఫైనల్లో భారత్‌ 10 వికెట్ల తేడాతో శ్రీలంకను చిత్తుచేసి ఎనిమిదో సారి ట్రోఫీ చేజిక్కించుకుంది.

టాస్‌ ఓడి మొదట బ్యాటింగ్‌కు దిగిన లంక 15.2 ఓవర్లలో 50 పరుగులకు ఆలౌటైంది. కుషాల్‌ మెండిస్‌ (17), దుషన్‌ హేమంత (13 నాటౌట్‌) మాత్రమే రెండంకెల స్కోరు చేయగా.. మిగిలిన వాళ్లంతా సింగిల్‌ డిజిట్‌కే పరిమితమయ్యారు. పాథుమ్‌ నిషాంక (2), కుషాల్‌ పెరెరా (0), సమరవిక్రమ (0), అసలంక (0), ధనంజయ డిసిల్వా (4), కెప్టెన్‌ దసున్‌ షనక (0) ఒకరి వెంట ఒకరు డగౌట్‌కు క్యూ కట్టారు. ఏడు ఓవర్ల స్పెల్‌లో సిరాజ్‌ టాపార్డర్‌ వెన్నువిరిస్తే.. మిగిలిన పని హార్దిక్‌ పాండ్యా (3/3) పూర్తి చేశాడు. అనంతరం స్వల్ప లక్ష్యఛేదనలో భారత్‌ 6.1 ఓవర్లలో వికెట్‌ నష్టపోకుండా 51 పరుగులు చేసింది.

ఓపెనర్లు శుభ్‌మన్‌ గిల్‌ (27 నాటౌట్‌; 6 ఫోర్లు), ఇషాన్‌ కిషన్‌ (23 నాటౌట్‌; 3 ఫోర్లు) ధనాధన్‌ ఇన్నింగ్స్‌లు ఆడారు. సూపర్‌-4 దశలో జరిగిన పోరులో టీమ్‌ఇండియాకు గట్టి పోటీనిచ్చిన లంక.. ఈ సారి కనీస ప్రతిఘటన లేకుండానే చేతులెత్తేసింది. ముఖ్యంగా.. సిరాజ్‌ బౌలింగ్‌ను ఎదుర్కొనేందుకు లంకేయులు బెంబేలెత్తిపోయారు. ఔట్‌ స్వింగ్‌తో విశ్వరూపం చూపిన సిరాజ్‌ బంతి విసరడం.. లంక బ్యాటర్‌ వికెట్‌ కోల్పోవడం ఇది యాక్షన్‌ రీప్లే సాగింది. ముఖ్యంగా లంక సారథి షనక ఔటైన బంతిని చూసి తీరాల్సిందే. ఇరు జట్లు కలిసి ఈ మ్యాచ్‌లో 129 బంతులే ఆడగా.. సిరాజ్‌కు ‘మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌’, కుల్దీప్‌కు ‘మ్యాన్‌ ఆఫ్‌ ది సిరీస్‌’అవార్డులుదక్కాయి.

1 అంతర్జాతీయ మ్యాచ్‌ల్లో ఒకే ఓవర్‌లో 4 వికెట్లు తీసిన తొలి భారత బౌలర్‌గా సిరాజ్‌ రికార్డుల్లోకెక్కాడు. ఓవరాల్‌గా నాలుగో బౌలర్‌.

2 వన్డే క్రికెట్‌లో శ్రీలంకకు ఇది (50) రెండో అత్యల్ప స్కోరు 2012 లో ఆ జట్టు దక్షిణాఫ్రికా చేతిలో 43 పరుగులకు ఆలౌటైంది. ఓవరాల్‌గా 50 ఓవర్ల ఫార్మాట్‌లో ఇది పదో అత్యల్పం.

4 వన్డేల్లో భారత్‌ తరఫున అత్యుత్తమ బౌలింగ్‌ గణాంకాలు నమోదు చేసిన నాలుగో బౌలర్‌గా సిరాజ్‌ నిలిచాడు. స్టువర్ట్‌ బిన్నీ (6/4), అనిల్‌ కుంబ్లే (6/12), బుమ్రా (6/19) ముందున్నారు.

8 ఆసియాకప్‌లో విజేతగా నిలువడం టీమ్‌ఇండియాకు ఇది ఎనిమిదోసారి. ఇదే అత్యధికం కాగా.. శ్రీలంక ఆరు సార్లు ట్రోఫీ గెలిచి రెండో స్థానంలో ఉంది.

సంక్షిప్త స్కోర్లు

శ్రీలంక: 15.2 ఓవర్లలో 50 ఆలౌట్‌ (కుషాల్‌ మెండిస్‌ 17; సిరాజ్‌ 6/21, పాండ్యా 3/3), భారత్‌: 6.1 ఓవర్లలో 51/0 (గిల్‌ 27 నాటౌట్‌, ఇషాన్‌ 23 నాటౌట్‌).

2023-09-17T21:54:53Z dg43tfdfdgfd