బెంగళూరులో ఆర్సీబీ విజయోత్సవ వేడుకల సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో 11 మంది మరణించిన ఘటన దేశ ప్రజలను విస్మయానికి గురి చేసింది. ఈ సంఘటనకు సంబంధించి పోలీసులు ఇప్పటికే కొందర్ని అరెస్ట్ చేశారు. అయినా సరే సోషల్ మీడియాలో మాత్రం అరెస్ట్ కోహ్లి అనే హ్యాష్ ట్యాగ్ ట్రెండ్ అవుతోంది. ఈ ఘటన తర్వాత విరాట్ కోహ్లి లండన్ వెళ్లిపోయాంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారు. గతంలో అల్లు అర్జున్‌ను అరెస్ట్ చేసినట్లే.. విరాట్ కోహ్లీని కూడా అరెస్ట్ చేయాలని కొందరు డిమాండ్ చేస్తున్నారు. ఈ డిమాండ్ వెనుక ఉన్న లాజిక్ ఏంటి..? ఇది సరైందేనా..? లేదా రాజకీయం చేస్తున్నారా అనేది ఇప్పుడు చూద్దాం..
కానీ కొందరు మాత్రం డబుల్ స్టాండర్డ్ ఎందుకు? అని ప్రశ్నిస్తున్నారు. హైదరాబాద్‌లో అల్లు అర్జున్‌ను అరెస్ట్ చేసినట్టుగానే.. బెంగళూరు ఘటనలో కోహ్లీని కూడా అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు.
ఇంకొందరేమో ఈ ఘటనను కర్ణాటక, తెలంగాణ రాజకీయాలతో కలిపి చర్చిస్తున్నారు. ఈ రెండు రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీనే అధికారంలో ఉంది కాబట్టి.. ఈ రెండు ఘటనల పట్ల రెండు ప్రభుత్వాలు ఒకేలా స్పందించాలి అన్నట్లుగా మాట్లాడుతున్నారు. పరోక్షంగా ఇటు తెలంగాణలో, అటు కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వాలను ఇరుకున పెట్టడం కోసం ఇలా మాట్లాడుతున్నారేమో అనే అనుమానాలు సైతం తలెత్తుతున్నాయి.
ఇక అల్లు అర్జున్, కోహ్లిని పోలుస్తూ.. సోషల్ మీడియాలో పోస్టు చేస్తున్న మీమ్స్‌కైతే కొదవేం లేదు.
కాబట్టి అల్లు అర్జున్‌ను అరెస్ట్ చేసినప్పుడు కోహ్లిని కూడా అరెస్ట్ చేయాలనే డిమాండ్.. న్యాయం కోసం కాకుండా సోషల్ మీడియాలో ట్రెండ్‌గా మారింది. అల్లు అర్జున్ తప్పేం లేకపోయినా, ఆయన్ను అన్యాయంగా అరెస్ట్ చేశారనే భావనను కూడా ఇందులో ధ్వనిస్తోంది.
అయితే అల్లు అర్జున్‌ను అరెస్ట్ చేశారు కదా అని విరాట్ కోహ్లిని అరెస్ట్ చేయాలనే డిమాండ్ సరైంది కాదని చాలా మంది అభిప్రాయపడుతున్నారు. అదే సమయంలో సెలబ్రిటీలకు రూల్స్ నుంచి మినహాయింపు ఉంటుందేమో అనే అనుమానం సైతం వ్యక్తమవుతోంది. చివరగా చెప్పాలంటే.. ఓ ఘటన జరిగినప్పుడు దానికి కారణమైన వ్యక్తి స్థాయిని చూడకుండా.. వాస్తవాల ఆధారంగా చర్యలు తీసుకోవడమే నిజమైన న్యాయం. కానీ కోహ్లిని అరెస్ట్ చేయాలనే డిమాండ్‌లో వాస్తవాలంటే కంటే భావోద్వేగాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి.
2025-06-06T14:44:31Z