అత్యుత్తమ ప్రదర్శన కనబరిచిన క్రికెటర్లను బీసీసీఐ నమన్ అవార్డులతో శనివారం సత్కరించింది. ముంబైలో జరిగిన ఈ అవార్డుల ప్రదానోత్సవంలో వివిధ విభాగాల్లో ఉత్తమ ప్రదర్శన కనబరిచిన ఆటగాళ్లకు పురస్కారాలు అందజేశారు. కాగా భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్‌ను జీవిత సౌఫల్య పురస్కారంతో బీసీసీఐ సత్కరించింది. టీమిండియా మొదటి కెప్టెన్ సీకే నాయుడు పేరుతో బీసీసీఐ ఈ అవార్డును అందజేసింది. ఇక మిగతా విభాగాల్లోనూ ఆటగాళ్లకు పురస్కారాలు అందజేశారు.కాగా ఈ అవార్డుల ప్రదానోత్సవంలో భాగంగా టీమిండియా మెన్స్, వుమెన్స్ క్రికెటర్లు ప్రత్యేక చిట్‌చాట్‌లు నిర్వహించారు. ఇందుకు సంబంధించిన వీడియోను బీసీసీఐ తన అధికారిక ట్విట్టర్ ఖాతాలో పోస్టు చేసింది. అయితే ఈ వీడియోలో రోహిత్ శర్మ చేసిన వ్యాఖ్యలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. వాస్తవానికి రోహిత్ శర్మ తన సరదా వ్యాఖ్యలతో నవ్వులు పూయిస్తూ ఉంటాడు. ఈ ఇంటర్వ్యూలోనూ అదే చేశాడు. చిట్‌చాట్‌లో కెప్టెన్ రోహిత్ శర్మతోపాటు ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్య, మహిళా క్రికెటర్లు స్మృతి మంధాన, జెమీమా రోడ్రిగ్స్ పాల్గొన్నారు. ఈ క్రమంలో హిట్‌మ్యాన్‌ను స్మృతి మంధాన ఓ ప్రశ్న అడిగింది. “మీకున్న అలవాట్లలో దేని గురించైనా తోటి క్రికెటర్లు ఆటపట్టించారా?” అని ప్రశ్నించింది. దీనికి రోహిత్ బదులిస్తూ.. “నాకైతే తెలియదు. కానీ, ఓ విషయంలో మాత్రం ఆటపట్టిస్తుంటారు. అదే నా మతిమరుపు గురించి. నేను కొన్ని విషయాలు మర్చిపోతానని.. వారు టీజ్ చేస్తారు. నిజానికి మరిచిపోవడం నా అలవాటు కాదు. కానీ అలా ఎందుకు చేస్తారో వారినే అడగాలి. నేను నా వాలెట్, పాస్‌పోర్ట్ మరిచిపోయినట్లు వారు టీజ్ చేస్తారు. అదంతా అబద్దం. అది ఇరవై ఏళ్ల క్రితం జరిగిన సంగతి” అని రోహిత్ చెప్పాడు. అదే క్రమంలో స్మృతి మంధాన మరో ప్రశ్న సంధించింది. “మీ జీవితంలో మీరు ఇప్పటి వరకు ఏదైనా అతిపెద్ద విషయాన్ని మరిచిపోయారా?” అని ప్రశ్నించింది. దీనికి రోహిత్ శర్మ చెప్పిన సమాధానం నవ్వులు పూయించింది. “ఈ ప్రశ్నకు నేను సమాధానం చెప్పలేను. ఈ ఇంటర్వ్యూ లైవ్‌లో వస్తే.. మా ఆవిడ (రితికా) కచ్చితంగా చూస్తుంది. అందుకే నేను దీని గురించి మాట్లాడను. ఈ ప్రశ్నకు సమాధానాన్ని నా దగ్గరే భద్రంగా ఉంచుకుంటా” అని రోహిత్ శర్మ నవ్వులు పూయించాడు. అయితే రోహిత్ ఎందుకిలా అన్నాడబ్బా.. అని ఫ్యాన్స్ చర్చించుకుంటున్నారు. ఓ హోటల్ గదిలో రోహిత్ తన వెడ్డింగ్ రింగ్‌ను మరిచిపోయాడని.. అదే విషయాన్ని చెబితే రితికా కోప్పడుతుందని చెప్పడం లేదనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.
2025-02-02T12:30:46Z