అమ్మాయిలు అద్వితీయం

  • అండర్‌-19 టీ20 ప్రపంచకప్‌ విజేత భారత్‌
  • ఫైనల్లో దక్షిణాఫ్రికాపై ఘన విజయం
  • తెలంగాణ స్టార్‌ త్రిష ఆల్‌రౌండ్‌ ప్రదర్శన
  • పలువురు ప్రముఖుల అభినందనలు

అమ్మాయిలు అద్భుతం చేశారు! మలేషియా గడ్డపై భారత త్రివర్ణ పతాకాన్ని రెపరెపలాడించారు. ఎదురైన ప్రత్యర్థినల్లా చిత్తుచేస్తూ ప్రతిష్ఠాత్మక అండర్‌-19 టీ20 ప్రపంచకప్‌లో టైటిల్‌ విజేతగా నిలిచారు. వరుసగా రెండోసారి టైటిల్‌ను ఒడిసిపట్టుకుని అమ్మాయిలు అద్వితీయమనిపించారు. సమిష్టి ప్రదర్శనతో సత్తాచాటుతూ ఫైనల్లో దక్షిణాఫ్రికాపై ఘన విజయంతో తమ కలల కప్‌ను సొంతం చేసుకున్నారు. త్రిష, ఆయూశి, వైష్ణవి స్పిన్‌ విజృంభణతో సఫారీలు స్వల్ప స్కోరుకే పరిమితమయ్యారు. లక్ష్యఛేదనలో వికెట్‌ కోల్పోయిన యువ భారత్‌ను తెలంగాణ స్టార్‌ గొంగడి త్రిష దూకుడైన బ్యాటింగ్‌తో గెలుపు తీరాలకు చేర్చింది. సఫారీ బౌలర్లను సమర్థంగా ఎదుర్కొంటూ అలవోకగా పరుగులు కొల్లగొట్టిన త్రిషకు ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌తో పాటు సిరీస్‌ దక్కాయి. ప్రపంచకప్‌లో ఆల్‌రౌండ్‌ ప్రదర్శనతో అదరగొట్టిన త్రిషను పలవురు ప్రముఖులు అభినందనలతో ముంచెత్తారు.

కౌలాలంపూర్‌: భారత్‌ ఖాతాలో మరో ప్రపంచకప్‌ టైటిల్‌. భవిష్యత్‌ ప్రతీకలుగా భావిస్తున్న యంగ్‌ తరంగ్‌లు మెగాటోర్నీలో దుమ్మురేపారు. మహిళల అండర్‌-19 టీ20 ప్రపంచకప్‌లో తిరుగులేని ప్రదర్శన కనబరుస్తూ భారత్‌ను విజేతగా నిలిపారు. ఆదివారం వార్‌వన్‌సైడ్‌ అన్నట్లు సాగిన ఫైనల్‌ పోరులో యువ భారత్‌ 9 వికెట్ల తేడాతో దక్షిణాఫ్రికాపై చిరస్మరణీయ విజయం సాధించింది. తొలుత గొంగడి త్రిష(3/15), ఆయూషి శుక్లా(2/9), వైష్ణవిశర్మ(2/23) ధాటికి సఫారీలు 20 ఓవర్లలో 82 పరుగులకు చాపచుట్టేశారు. వీరి విజృంభణకు మీకి వాన్‌ వ్రూస్ట్‌(23) మినహా అందరూ ఘోరంగా విఫలమయ్యారు. ఆ తర్వాత స్వల్ప లక్ష్యఛేదనకు దిగిన యంగ్‌ ఇండియా 11.2 ఓవర్లలో వికెట్‌ నష్టానికి 84 పరుగులు చేశారు. ఓపెనర్‌ త్రిష(33 బంతుల్లో 44 నాటౌట్‌, 8ఫోర్లు) మరోమారు సత్తాచాటగా, సనికా చాల్కె(26 నాటౌట్‌) ఆకట్టుకుంది. రెయిన్కె(1/14) ఒక వికెట్‌ దక్కింది. మెగాటోర్నీ ఆసాంతం ఆల్‌రౌండ్‌ ప్రదర్శనతో అదరగొట్టిన త్రిషకు ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’తో పాటు ‘ప్లేయర్‌ ఆఫ్‌ సిరీస్‌’దక్కింది.

భారత్‌ స్పిన్‌ తడాఖా:

తొలుత టాస్‌ గెలిచిన దక్షిణాఫ్రికా.. బ్యాటింగ్‌ ఎంచుకుంది. ఇక్కడే సఫారీలు తప్పటడుగు వేశారు. మెగాటోర్నీలో తమ బౌలింగ్‌తో ప్రత్యర్థులను స్వల్ప స్కోర్లకు పరిమితం చేస్తున్న టీమ్‌ఇండియా ఫైనల్లోనూ అదే పునరావృతం చేసింది. జోషిత వేసిన ఇన్నింగ్స్‌ తొలి ఓవర్‌లో జెమ్మా బోథా వరుసగా రెండు ఫోర్లతో దూకుడు కనబరిచింది. అప్పటికే పిచ్‌ పరిస్థితులపై అంచనాకు వచ్చిన భారత కెప్టెన్‌ నికీ ప్రసాద్‌..రెండో ఓవర్‌లోనే స్పిన్నర్‌ పరుణిక సిసోడియా(2/6) దింపి ఫలితం రాబట్టింది. పరుణిక బంతిని సరిగ్గా అర్థం చేసుకోని సిమోన్‌ లారెన్స్‌ క్లీన్‌బౌల్డ్‌గా వెనుదిరిగింది. బౌలింగ్‌ మార్పుగా వచ్చిన ఆంధ్రప్రదేశ్‌ యువ పేసర్‌ షబ్నమ్‌ షకీల్‌(1/7) ఆఖరి బంతికి ప్రమాదకర బోథాను ఔట్‌ చేసింది. డ్రైవ్‌ ఆడబోయిన బోథా..వికెట్‌కీపర్‌ కమలిని చేతికి చిక్కింది. దీంతో దక్షిణాఫ్రికా 20 పరుగులకే ఓపెనర్ల వికెట్లు కోల్పోయింది. వచ్చి రావడంతోనే ఆయూషి శుక్లా తొలి బంతికే దైరా రమల్కాన్‌(3) క్లీన్‌బౌల్డ్‌ చేసింది.

షాట్‌ ఆడే క్రమంలో బంతిని అంచనా వేయలేకపోయిన రమల్కాన్‌ మూడో వికెట్‌గా వెనుదిరిగింది. దీంతో పవర్‌ప్లే ముగిసే సరికి దక్షిణాఫ్రికా 3వికెట్లకు 29 పరుగులు చేసింది. పరుణిక, ఆయూషికి తోడు లెఫ్టార్మ్‌ స్పిన్నర్‌ వైష్ణవిశర్మ కూడా జత కలువడంతో సఫారీల ఆటలు సాగలేదు. ఈ క్రమంలో త్రిషను ప్రయోగించడం భారత్‌కు కలిసొచ్చింది. 12వ ఓవర్‌లో రెన్కె(7)ను త్రిష ఔట్‌ చేసింది. ఆ మరుసటి ఓవర్‌లోనే కరాబో మెసో(10)..ఆయూషికి వికెట్‌ సమర్పించుకుంది. ఓవైపు వరుస వికెట్లకు తోడు పరుగుల రాక మందగించింది. మరోమారు బౌలింగ్‌కు వచ్చిన త్రిష..వరుస బంతుల్లో వాన్‌రూస్ట్‌(23), సెషెనీ(0)ను ఔట్‌ చేసి భారత్‌ను సంబురాల్లో ముంచింది. దీంతో ఆరో వికెట్‌కు 30 పరుగుల భాగస్వామ్యానికి బ్రేక్‌ పడింది. మరో ఎండ్‌లో తానేం తక్కువ కాదన్నట్లు వైష్ణవి..కౌలింగ్‌(15), మోనాలిసా(0)ను వెంటవెంటనే ఔట్‌ చేసింది. ఇన్నింగ్స్‌ ఆఖరి బంతికి పరుణిక..అశ్లే(0) ఔట్‌ చేయడంతో సఫారీలు ఆలౌటయ్యారు.

త్రిషా ధనాధన్‌:

మెగాటోర్నీలో ప్రత్యర్థి ఎవరన్నది లెక్కచేయకుండా బ్యాటింగ్‌లో దుమ్మురేపిన త్రిష..ఫైనల్లోనూ అదే జోరు కనబరిచింది. మరో ఓపెనర్‌ కమలిని(8)తో కలిసి ఇన్నింగ్స్‌ను ప్రారంభించింది. తాను ఎదుర్కొన్న తొలి బంతినే బౌండరీగా మలిచిన త్రిష..మళ్లీ వెనుదిరిగి చూసుకోలేదు. కౌలింగ్‌ను రెండు ఫోర్లతో అరుసుకున్న త్రిష..సెషనీ ఓవర్‌లో మూడు ఫోర్లతో విరుచుకుపడింది. అయితే రెన్కె బౌలింగ్‌లో కమలిని ఔట్‌ కావడంతో తొలి వికెట్‌కు 36 పరుగుల పార్టనర్‌షిప్‌కు బ్రేక్‌ పడింది.అప్పటికే క్రీజులో కుదురుకున్న త్రిషకు సనిక జతకలిసింది. వీరిద్దరు సఫారీ బౌలర్లను ఆత్మవిశ్వాసంతో ఎదుర్కొన్నారు. వాన్‌విక్‌ 8వ ఓవర్‌లో సనిక రెండు ఫోర్లతో టచ్‌లోకి వచ్చింది. ఈ ఇద్దరు కూడా ఎక్కడా తడబాటుకు లోనుకాకుండా లక్ష్యాన్ని అంతకంతకు తగ్గించుకుంటూ వచ్చారు. 12వ ఓవర్‌లో రెండో బంతికి సనిక బౌండరీతో ఫైనల్‌ మ్యాచ్‌కు సూపర్‌ స్టయిల్‌లో ఫినిషింగ్‌ టచ్‌ ఇచ్చింది.

నారీశక్తి చూస్తే చాలా గర్వంగా ఉంది! ఐసీసీ అండర్‌-19 టీ20 ప్రపంచకప్‌ గెలిచిన భారత మహిళల జట్టుకు అభినందనలు. జట్టు సమిష్టితత్వానికి, సంకల్పం, ధైర్యానికి ఈ విజయం ప్రతీకగా నిలిచింది. ఇది ఎంతో మంది యువ ప్లేయర్లకు స్ఫూర్తిగా నిలుస్తుంది.

వరుసగా రెండోసారి అండర్‌-19 టీ20 ప్రపంచకప్‌ సాధించిన భారత మహిళల జట్టుకు అభినందనలు. దక్షిణాఫ్రికాతో జరిగిన ఫైనల్లో యువ భారత్‌ చిరస్మరణీయ విజయం సాధించింది. ఇందులో కీలకపాత్ర పోషించిన తెలంగాణ బిడ్డ గొంగడి త్రిషకు ప్రత్యేక శుభాకాంక్షలు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలానికి చెందిన త్రిష ఆల్‌రౌండ్‌ ప్రదర్శనతో ఆకట్టుకుంది. ప్లేయర్‌ ఆఫ్‌ ద సిరీస్‌గా నిలువడం రాష్ర్టానికి గర్వకారణం.

– సీఎం రేవంత్‌రెడ్డి

చారిత్రక విజయం

ఐసీసీ అండర్‌-19 టీ20 ప్రపంచకప్‌ గెలిచిన భారత మహిళల జట్టు మనల్ని అందరినీ గర్వపడేలా చేసింది. ఆల్‌రౌండ్‌ ప్రదర్శనతో సత్తాచాటారు. టోర్నీ ఆసాంతం రాణించిన తెలంగాణ అమ్మాయి త్రిషకు ప్రత్యేక అభినందనలు. ప్లేయర్‌ ఆఫ్‌ సిరీస్‌తో పాటు ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌ దక్కించుకుని త్రిష జట్టును ముందుండి నడిపించిన తీరు అద్భుతం.

– కేటీఆర్‌ బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌

టీమ్‌ఇండియా గర్వపడే సందర్భం

ఐసీసీ మహిళల అండర్‌-19 ప్రపంచకప్‌ గెలిచిన భారత జట్టుకు అభినందనలు. మెగాటోర్నీలో అద్భుత ప్రదర్శన, సమిష్టితత్వం ప్రదర్శిస్తూ గొప్ప విజయాన్ని అందుకున్నారు. ప్రపంచకప్‌లో 300ల పైచిలుకు పరుగులు, 7 వికెట్లతో అసమాన ప్రదర్శన కనబరిచిన తెలంగాణ క్రికెటర్‌ గొంగడి త్రిషకు ప్రత్యేక అభినందనలు. భవిష్యత్‌ తరానికి త్రిష స్ఫూర్తిగా నిలుస్తుంది.

– హరీశ్‌రావు, మాజీ మంత్రి

స్కోరుబోర్డు

దక్షిణాఫ్రికా: బోథా(సి)కమలిని(బి)షబ్నమ్‌ 16, సిమోన్‌(బి)పరుణిక 0, రామల్కన్‌(బి)ఆయూషి 3, రెన్కె(సి)పరుణిక(బి)త్రిష 7, మెసో(బి)ఆయూషి 10, వ్రూస్ట్‌ (స్టంప్‌/కమలిని)(బి)త్రిష 23, కౌలింగ్‌(బి)వైష్ణవి 15, సెషెనీ(బి)త్రిష 0, వాన్‌విక్‌(సి)వైష్ణవి(బి)పరుణిక 0, లెగోడి(బి)వైష్ణవి 0, నిని 2 నాటౌట్‌; ఎక్స్‌ట్రాలు: 6; మొత్తం: 20 ఓవర్లలో 82 ఆలౌట్‌; వికెట్ల పతనం: 1-11, 2-20, 3-20, 4-40, 5-44, 6-74, 7-74, 8-80, 9-80, 10-82; బౌలింగ్‌: జోషిత 2-0-17-0, పరుణిక 4-0-6-2, షబ్నమ్‌ 2-0-7-1, ఆయూషి 4-2-9-2, వైష్ణవి 4-0-23-2, త్రిష 4-0-15-3.

భారత్‌: కమిలిని(సి)లౌరెన్స్‌(బి)రెన్కె 8, త్రిష 44 నాటౌట్‌, సనిక 26 నాటౌట్‌; ఎక్స్‌ట్రాలు: 6; మొత్తం: 11.2 ఓవర్లలో 84/1; వికెట్ల పతనం: 1-36; బౌలింగ్‌: నిని 1-0-7-0, కౌలింగ్‌ 2-0-19-0, రెన్కె 4-1-14-1, సెషెనీ 1-0-12-0, వాన్‌విక్‌ 1-0-12-0, లెగోడి 1.2-0-10-0, బోథా 1-0-9-0.

2025-02-02T22:41:44Z