అది నాకు అలవాటే.. ప్రపంచకప్ మ్యాచ్‌లపై మహమ్మద్ షమీ

టీమిండియా స్టార్ పేసర్ మహమ్మద్ షమీ గత కొన్ని నెలలుగా గాయంతో క్రికెట్‌కు దూరమైన విషయం తెలిసిందే. వన్డే ప్రపంచకప్ 2023 ఫైనల్ తర్వాత అతడు మళ్లీ మైదానంలో కనిపించలేదు. గాయంతోనే టోర్నీలో పాల్గొన్న అతడు ఆ తర్వాత తీవ్రత ఎక్కువ కావడంతో కొన్ని నెలల పాటు బెడ్‌కే పరిమితమయ్యాడు. ఆ తర్వాత క్రమంగా కోలుకుని ఇప్పుడిప్పుడే మళ్లీ ప్రాక్టీస్ చేస్తున్నాడు. ఈ ఏడాది చివర్లో ఆస్ట్రేలియా పర్యటన నాటికి పూర్తి ఫిట్‌నెస్ సాధించాలని షమీ పట్టుదలతో ఉన్నాడు.

ఇటీవల ఓ కార్యక్రమంలో పాల్గొన్న మహమ్మద్ షమీ వన్డే ప్రపంచకప్‌లలో తన జర్నీ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. తానూ 2015, 2019, 2023 వన్డే ప్రపంచకప్‌లు ఆడానని.. అయితే ఇందులో ఒక్కసారి కూడా తాను ప్రాధాన్య పేసర్‌గా లేనని చెప్పుకొచ్చాడు. కానీ అవకాశం వచ్చిన తర్వాత దాన్ని సద్వినియోగం చేసుకుని.. జట్టులో సుస్థిర స్థానం పొందినట్లు వ్యాఖ్యానించాడు. షమీ మాట్లాడుతుండా కెప్టెన్ రోహిత్ శర్మ, టీమిండియా మాజీ హెడ్‌కోచ్ రాహుల్ ద్రవిడ్‌లు అక్కడే ఉన్నారు.

"నాకు ఇది అలవాటే అనుకుంటున్నా. 2015, 2019, 2019 వన్డే ప్రపంచకప్‌లలోనూ ఇదే తరహా అనుభవాన్ని ఎదుర్కొన్నా. ఆ టోర్నీలకు తొలుత నేను ప్రాధాన్య బౌలర్‌గా లేను. కానీ నాకు అవకాశం లభించినప్పుడు మాత్రం మెరుగైన ప్రదర్శన చేసేందుకు ప్రయత్నిస్తాం. ఇందులో విజయం సాధించాను కూడా. ఈ విషయంలో దేవుడికి థాంక్స్. దీన్ని హార్డ్ వర్క్ అని కూడా పిలవొచ్చు. నేను ఎప్పుడూ కూడా అవకాశం రాలేదని బాధపడను. అవకాశం కోసం ఎదురుచూస్తుంటా. అలా సిద్ధంగా ఉంటేనే.. మీ సత్తాను మీరు నిరూపించుకోగలరు" అని మహమ్మద్ షమీ వ్యాఖ్యానించాడు.

షమీ వ్యాఖ్యలు అతడి నిబద్ధతను తెలియజేస్తున్నాయని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. వాస్తవానికి షమీ చెప్పింది వాస్తవం. ఎందుకంటే అతడు పాల్గొన్న మూడు ప్రపంచకప్‌లలోనూ తొలుత తుది జట్టులో అతడికి చోటు దక్కలేదు. కానీ టోర్నీలో కొన్ని మ్యాచులు అయ్యాక.. ఎవరో గాయపడితేనో.. లేదా రాణించకపోతేనో అతడికి ఛాన్స్ వచ్చేది. వచ్చిన అవకాశాన్ని షమీ సద్వినియోగం చేసుకునేవాడు. జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషించాడు. గతేడాది జరిగిన వన్డే ప్రపంచకప్‌లోనూ ఇదే జరిగింది. ప్రపంచకప్ టైటిల్‌ను భారత్ సాధించకపోయినా.. షమీ మాత్రం తన బెస్ట్ ఇచ్చాడు.

ఈ టోర్నీలో తొలి మూడు మ్యాచులకు అతడు బెంచ్‌కే పరిమితమయ్యాడు. కానీ హార్దిక్ పాండ్యా గాయపడటంతో న్యూజిలాండ్‌తో మ్యాచు నుంచి తుది జట్టులోకి వచ్చాడు. ఆ మ్యాచులో ఏకంగా ఐదు వికెట్లు తీసి.. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు. టోర్నీలో మొత్తంగా ఏడు మ్యాచుల్లో 24 వికెట్లు పడగొట్టాడు. 2015 వరల్డ్ కప్‌లో 17 వికెట్లు, 2019 ప్రపంచకప్‌లో 14 వికెట్లను షమీ తీశాడు. కాగా మహమ్మద్ షమీ బర్త్‌ డే నేడు. అతడు ఇవాళ్టితో 34వ పడిలోకి అడుగుపెట్టాడు. హ్యాపీ బర్త్ డే షమీ.

ఇటువంటి మరిన్ని వార్తలు సమయం తెలుగులో చదవండి. లేటెస్ట్ వార్తలు, సిటీ వార్తలు, జాతీయ వార్తలు, బిజినెస్ వార్తలు, క్రీడా వార్తలు, రాశిఫలాలు ఇంకా లైఫ్‌స్టైల్ అప్‌డేట్లు మొదలగునవి తెలుసుకోండి. వీడియోలను TimesXP లో చూడండి.

2024-09-03T07:14:37Z dg43tfdfdgfd