అత్యధిక ఆదాయపు పన్ను చెల్లించే క్రికెటర్లు వీరే.. కోహ్లీనే టాప్..!

కపిల్ దేవ్ సారథ్యంలో భారత క్రికెట్ జట్టు 1983 వన్డే ప్రపంచకప్ గెలిచిన తర్వాత దేశంలో క్రికెట్‌కు ఎనలేని ఆదరణ పెరిగింది. దేశంలో అత్యధిక మంది ఫాలో అవుతున్న క్రీడగా మారిపోయింది. దేశంలో ఏ ఆటకూ లేని క్రేజ్ క్రికెట్ సొంతం. ఇక 2008లో ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఎంట్రీతో క్రికెట్ మరో స్థాయికి చేరింది. ఐపీఎల్‌కు ముందు.. ఐపీఎల్‌కి తర్వాత అన్నట్లుగా పరిస్థితి మారింది. దీంతో ఆటగాళ్లు భారీ ఆర్జించడం ప్రారంభించారు. సెలబ్రెటీలుగా మారిన క్రికెటర్లను ప్రచార కర్తలుగా నియమించుకునేందుకు పలు వ్యాపార కంపెనీలు క్యూ కట్టాయి. దీంతో వారి ఆదాయం గణనీయంగా పెరిగింది. ఈ నేపథ్యంలో తాజాగా ఓ ఆసక్తికర విషయం వెలుగులోకి వచ్చింది.

ఇక్కడా కోహ్లీనే టాప్..

క్రికెటర్లలో ఎవరు అత్యధికంగా పన్నులు చెల్లిస్తున్నారు అనేది చర్చనీయాంశంగా మారింది. అయితే ఇటీవల జాబితా విడుదల చేసిన ఫార్చ్యూన్ ఇండియా.. 2023-2024 ఆర్థిక సంవత్సరంలో విరాట్ కోహ్లీ అత్యధికంగా ఆదాయపు పన్ను చెల్లించిన క్రీడాకారుడిగా ఉన్నట్లు తెలిపింది. ప్రస్తుతం అంతర్జాతీయ మ్యాచులు లేకపోవడంతో విరాట్ కోహ్లీ.. కుటుంబంతో కలిసి లండన్‌లో ఉన్నాడు. అతడు 2023-2024 ఆర్థిక సంవత్సరంలో రూ.66 కోట్ల పన్ను చెల్లించినట్లు తెలుస్తోంది.

క్రికెటర్లలో అత్యధిక పన్ను చెల్లించిన జాబితాలో టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ.. రెండో స్థానంలో ఉన్నాడు. అతడు రూ.38 కోట్లను పన్ను రూపంలో చెల్లించినట్లు తెలుస్తోంది. ఇక టీమిండియా క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ ఈ జాబితాలో మూడో స్థానంలో నిలిచాడు. సచిన్.. రూ.28 కోట్ల ఆదాయపు పన్ను చెల్లంచినట్లు సమాచారం.

ఫార్చ్యూన్ ఇండియా విడుదల చేసిన సెలబ్రిటీ పన్ను చెల్లింపుదారుల జాబితాలో రూ.23 కోట్లతో సౌరవ్ గంగూలీ నాలుగు స్థానంలో ఉన్నాడు. ఇక టీమిండియా స్టార్ ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా రూ.13 కోట్లు ఆదాయపు పన్ను చెల్లించినట్లు తెలుస్తోంది. ఇదే సమయంలో టీమిండియా వికెట్ కీపర్ రిషభ్ పంత్ సైతం రూ.10 కోట్లు ఆదాయపు పన్ను చెల్లించాడు.

కాగా ప్రస్తుతం భారత స్టార్ క్రికెటర్లు రెస్ట్ మోడ్‌లో ఉన్నారు. అయితే ఇవాళ్టి నుంచి ప్రారంభం కానున్న దులీప్ ట్రోఫీలో శుభ్‌మన్ గిల్, కేఎల్ రాహుల్, కుల్‌దీప్ యాదవ్, రిషభ్ పంత్, సూర్యకుమార్ యాదవ్, శ్రేయస్ అయ్యర్‌లు ఆడనున్నారు. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, జస్‌ప్రీత్ బుమ్రాలు ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటున్నారు. ఈ నెల 19 నుంచి ప్రారంభం కానున్న బంగ్లాదేశ్‌తో టెస్టు సిరీస్‌తో మళ్లీ మైదానం బాట పట్టనున్నారు.

ఇటువంటి మరిన్ని వార్తలు సమయం తెలుగులో చదవండి. లేటెస్ట్ వార్తలు, సిటీ వార్తలు, జాతీయ వార్తలు, బిజినెస్ వార్తలు, క్రీడా వార్తలు, రాశిఫలాలు ఇంకా లైఫ్‌స్టైల్ అప్‌డేట్లు మొదలగునవి తెలుసుకోండి. వీడియోలను TimesXP లో చూడండి.

2024-09-05T04:00:22Z dg43tfdfdgfd