Ziaur Rahman : ఇష్టమైన రంగంలో అద్భుతంగా రాణిస్తూ.. గొప్ప శిఖరాలకు చేరిన ఓ గ్రాండ్‌మాస్టర్ జీవితం విషాదంగా ముగిసింది. అరవై నాలుగు గడుల ఆటనే నమ్ముకున్న ఆయన మ్యాచ్ ఆడుతూనే తుదిశ్వాస విడిచాడు. ఆయన పేరు జియౌర్ రహ్మాన్(Ziaur Rahman). బంగ్లాదేశ్‌కు చెందిన సీనియర్ గ్రాండ్‌మాస్టర్ అయిన రహ్మన్ శుక్రవారం చెస్ ఆడుతూనే మృత్యుఒడిలోకి జారుకున్నాడు.
స్వదేశంలో జరుగుతున్న నేషనల్ చాంపియన్‌షిప్‌లో రహ్మాన్ పాల్గొన్నాడు. శుక్రవారం ఆయన ఎనాముల్ హొస్సేన్‌తో తలపడ్డాడు. అయితే. గేమ్ 12వ రౌండ్ సమయంలో రహ్మాన్ ఉన్నట్టుండి గుండెపోటుకుతో కింద కూలబడిపోయాడు.
దాంతో, అక్కడున్నవాళ్లకు ఒక్క క్షణం ఏమీ అర్ధం కాలేదు. రహ్మాన్‌లో స్పందన లేకపోవడంతో అప్రమత్తమైన నిర్వాహకులు.. ఆయనను వెంటనే ఢాకాలోని ఓ హాస్పిటల్‌కు తరలించారు. అయితే.. అప్పటికే ఆయన మరణించినట్టు అక్కడి వైద్యులు చెప్పారు. చదరంగమే శ్వాసగా బతికిన రహ్మాన్ అదే ఆట మధ్యలోనే తనువు చాలించడంతో బంగ్లాదేశ్‌లో విషాదఛాయలు అలుముకున్నాయి.
బంగ్లాదేశ్‌లోని ఉత్తమ చెస్ ప్లేయర్లలో రహ్మాన్ ఒకరు. 1993లో గ్రాండ్‌మాస్టర్ టైటిల్ గెలుపొందిన ఆయన.. దేశం తరఫున 17 సార్లు చెస్ ఒలింపియాడ్‌లో పాల్గొన్నారు. అంతేకాదు చెస్ ఆటలో యువకులకు శిక్షణ ఇచ్చేవారు కూడా. రహ్మాన్ కుమారుడు తహ్సిన్ తజ్వార్ సైతం చెస్ ప్లేయరే. అయితే.. రెహ్మాన్ గుండెపోటుతో కుప్పకూలే సమయానికి అతడు ఆ పక్కనే మరొకరితో తలపడుతున్నాడు. కండ్ల ముందే తండ్రి మరణంతో తహ్సిన్ గుండెలవిసేలా రోదించాడు.