WIMBLEDON | వింబుల్డన్‌ టోర్నీ.. క్వార్టర్స్‌కు అల్కారజ్‌, సిన్నర్‌

Wimbledon | లండన్‌: డిఫెండింగ్‌ చాంపియన్‌ కార్లోస్‌ అల్కారజ్‌ వింబుల్డన్‌ క్వార్టర్స్‌కు దూసుకెళ్లాడు. ఆదివారం సెంటర్‌ కోర్ట్‌ వేదికగా జరిగిన పురుషుల సింగిల్స్‌ ప్రిక్వార్టర్స్‌ మ్యాచ్‌లో ఈ స్పెయిన్‌ కుర్రాడు 6-3, 6-4, 1-6, 7-5తో ఉగొ హంబర్ట్‌ (ఫ్రెంచ్‌)పై అలవోకగా గెలిచి క్వార్టర్స్‌ చేరాడు. మూడో రౌండ్‌లో టియోఫితో కష్టపడి నెగ్గిన అల్కారజ్‌కు ప్రిక్వార్టర్స్‌లో మాత్రం విజయం నల్లేరు మీద నడకలా సాగింది. మ్యాచ్‌లో 14 ఏస్‌లు సంధించిన అతడు.. 45 విన్నర్లు కొట్టి 6 డబుల్‌ ఫాల్ట్స్‌ చేశాడు.

మరో మ్యాచ్‌లో ఒకటో సీడ్‌ జన్నిక్‌ సిన్నర్‌ (ఇటలీ) 6-2, 6-4, 7-6 (11/9)తో బెన్‌ షెల్టన్‌ (అమెరికా)ను ఓడించి క్వార్టర్స్‌లో ప్రవేశించాడు. కాగా మహిళల సింగిల్స్‌లో ప్రపంచ నెంబర్‌ వన్‌ ర్యాంకర్‌ ఇగా స్వియాటెక్‌ 6-3, 1-6, 2-6తో అన్‌సీడెడ్‌ యులియా పుటిన్‌సెవా (కజకిస్థాన్‌) చేతిలో ఓడి మూడో రౌండ్‌లోనే నిష్క్రమించింది. ఏడో సీడ్‌ జాస్మిన్‌ పలోని (ఇటలీ) 6-3, 6-7 (6/8), 5-5 తో మాడిసన్‌ కీస్‌ (అమెరికా)పై గెలిచి తన తొలి వింబుల్డన్‌ క్వార్టర్స్‌ చేరుకుంది. మూడో సెట్‌లో కీస్‌ కాలికి గాయమవడంతో ఆమె పోటీ నుంచి తప్పుకోవడంతో పలోని ముందంజ వేసింది.

2024-07-08T00:31:38Z