VIRAT KOHLI | 12 ఏండ్లలో అత్యల్పం.. మరింత దిగజారిన కోహ్లీ ర్యాంకు

  • రోహిత్‌ పరిస్థితి అధ్వాన్నం

Virat Kohli | దుబాయ్‌: బోర్డర్‌ గవాస్కర్‌ ట్రోఫీ (బీజీటీ)లో పేలవ ఫామ్‌తో ఇంటా బయటా విమర్శలు ఎదుర్కుంటున్న భారత దిగ్గజ క్రికెటర్లు విరాట్‌ కోహ్లీ, రోహిత్‌ శర్మ తాజాగా ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్‌లో మరింత దిగజారారు. ఐసీసీ తాజాగా విడుదల చేసిన ర్యాంకింగ్‌ జాబితాలో కోహ్లీ.. మూడు స్థానాలు దిగజారి 27వ ర్యాంక్‌కు పడిపోగా రోహిత్‌శర్మ 42వ స్థానంలో ఉన్నాడు. గడిచిన 12 ఏండ్ల కాలంలో టాప్‌-25లో లేకపోవడం కోహ్లీకి ఇదే తొలిసారి. 2012 డిసెంబర్‌లో కోహ్లీ చివరి సారిగా 36వ ర్యాంకులో ఉన్నాడు.

ఆస్ట్రేలియాతో సిరీస్‌లో పెర్త్‌ టెస్టు సెంచరీ మినహా మిగిలిన 8 ఇన్నింగ్స్‌లో కోహ్లీ చేసింది 90 పరుగులే. ఆఫ్‌స్టంప్‌ అవతల వెళ్తున్న బంతులను వేటాడి బలైన కోహ్లీ.. ఆసీస్‌ పేసర్‌ స్కాట్‌ బొలాండ్‌కు నాలుగు సార్లు ఇదే రూపంలో వికెట్‌ సమర్పించుకున్నాడు. ఇక గతేడాది స్వదేశంలో బంగ్లాదేశ్‌ సిరీస్‌కు ముందు ఆరో స్థానంలో ఉన్న రోహిత్‌ ర్యాంకు క్రమంగా దిగువకు పడిపోయింది. న్యూజిలాండ్‌తో 3 మ్యాచ్‌ల సిరీస్‌ తర్వాత 26కు పడిపోయిన హిట్‌మ్యాన్‌ ర్యాంకు.. తాజాగా 42వ ర్యాంక్‌ వద్ద నిలిచింది. ఈ జాబితాలో టాప్‌-10లో నిలిచిన బ్యాటర్లలో భారత్‌ నుంచి యశస్వీ జైస్వాల్‌ (4), రిషభ్‌ పంత్‌ (9) ఉన్నారు.

2025-01-08T19:30:14Z