VIJAY SHANKAR: పాండ్యా బౌలింగ్‌లో హ్యాట్రిక్ సిక్స‌ర్లు కొట్టిన శంక‌ర్‌.. వీడియో

ఇండోర్‌: ఆల్‌రౌండ‌ర్ విజ‌య్ శంక‌ర్‌(Vijay Shankar).. హ్యాట్రిక్ సిక్స‌ర్ల‌తో స‌త్తా చాటాడు. త‌న ప‌వ‌ర్ హిట్టింగ్ ఏంటో చూపించాడు. మ‌రో ఆల్‌రౌండ‌ర్ హార్దిక్ పాండ్యా బౌలింగ్‌లో అత‌ను భారీ షాట్లు బాదాడు. ఇండోర్‌లో జ‌రుగుతున్న స‌య్య‌ద్ ముస్తాక్ అలీ టీ20 టోర్నీలో.. చెన్నై జ‌ట్టు ప్లేయ‌ర్ విజ‌య్ శంక‌ర్‌.. భీక‌ర హిట్టింగ్ చేశాడు. గుజ‌రాత్ ప్లేయ‌ర్ పాండ్యా బౌలింగ్‌లో హ్యాట్రిక్ సిక్స‌ర్లు కొట్టాడు. కొన్ని రోజుల క్రితం జ‌రిగిన ఐపీఎల్ 2025 వేలంలో చెన్నై జ‌ట్టు అత‌న్ని 1.20 కోట్ల‌కు సొంతం చేసుకున్న‌ది. విజ‌య్ శంక‌ర్ భీక‌ర రూపంలో ఉన్న‌ట్లు సీఎస్కే జ‌ట్టు ట్విట్ట‌ర్‌లో ఆ వీడియోను పోస్టు చేసింది.

విజ‌య్ శంక‌ర్ ఇండియా త‌ర‌పున 12 వ‌న్డేలు, 9 టీ20 మ్యాచ్‌లు ఆడాడు. చివ‌రిసారి అత‌ను 2019లో వెస్టిండీస్‌తో అంత‌ర్జాతీయ మ్యాచ్ ఆడాడు. స‌య్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ మ్యాచ్‌లో పాండ్యా నేతృత్వంలోని బ‌రోడా జ‌ట్టు.. 5 వికెట్ల తేడాతో చెన్నైపై విజ‌యం సాధించింది. ఈ మ్యాచ్‌లో హార్దిక్ పాండ్యా 35 బంతుల్లో 74 ర‌న్స్ చేశాడు. దాంట్లో ఆరు ఫోర్లు, 5 సిక్స‌ర్లు ఉన్నాయి. ఈ ఇన్నింగ్స్‌తో టీ20 క్రికెట్‌లో పాండ్యా కొత్త రికార్డును న‌మోదు చేశాడు. ఆ ఫార్మాట్‌లో 5వేల ప‌రుగులు, 100 పైగా వికెట్లు తీసిన ప్లేయ‌ర్‌గా నిలిచాడు. పాండ్యా ఇప్ప‌టి వ‌ర‌కు టీ20 ఫార్మాట్‌లో 5067 ర‌న్స్ చేశాడు. 180 వికెట్లు తీసుకున్నాడు.

2024-11-28T07:26:34Z