TEAM INDIA | బోణీ కొట్టిన యువ భారత్‌.. జింబాబ్వేపై ప్రతీకార విజయం

  • అభిషేక్‌ సుడిగాలి శతకం
  • రాణించిన రుతురాజ్‌, అవేశ్‌
  • ఛేదనలో తేలిపోయిన జింబాబ్వే
  • రెండో టీ20లో టీమ్‌ఇండియా ఘన విజయం

జింబాబ్వే పర్యటనలో యువ భారత్‌ బోణీ కొట్టింది. తొలి టీ20లో తమకు ఊహించని షాకిచ్చిన ఆతిథ్య జట్టుపై 24 గంటలు గడవకముందే కసిగా ప్రతీకారం తీర్చుకుంది. తొలి మ్యాచ్‌లో డకౌట్‌ అయినా క్రీజులో నిలబడితే తానెంత ప్రమాదకర ఆటగాడో అభిషేక్‌ శర్మ రెండో టీ20తో చెప్పకనే చెప్పాడు.

హరారేలో అభిషేక్‌ తుఫాను తర్వాత రుతురాజ్‌ గైక్వాడ్‌, రింకూ సింగ్‌ విధ్వంసకర ఆటతీరుతో భారత్‌ రికార్డు స్కోరు చేసింది. అనంతరం భారీ ఛేదనలో మన పేసర్లు ముకేశ్‌, అవేశ్‌ ధాటికి జింబాబ్వే బ్యాటింగ్‌ ఆర్డర్‌ అతలాకుతలమైంది.

Team India | హరారే: సీనియర్ల గైర్హాజరీలో జింబాబ్వే పర్యటనకు వెళ్లిన యువ భారత్‌ బోణీ కొట్టింది. తొలి మ్యాచ్‌లో తమను ఓడించిన ఆతిథ్య జట్టుపై అన్ని విభాగాల్లోనూ సంపూర్ణ ఆధిపత్యం చెలాయించి వంద పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది. ఐపీఎల్‌లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ తరఫున ఆడుతూ అదిరిపోయే ప్రదర్శనలతో జాతీయ జట్టులో చోటు దక్కించుకున్న యువ ఓపెనర్‌ అభిషేక్‌ శర్మ (47 బంతుల్లో 100, 7 ఫోర్లు, 8 సిక్సర్లు) అంతర్జాతీయ కెరీర్‌లో ఆడిన రెండో మ్యాచ్‌లోనే సుడిగాలి శతకం బాదాడు. అతడికి తోడుగా రుతురాజ్‌ గైక్వాడ్‌ (47 బంతుల్లో 77 నాటౌట్‌, 11 ఫోర్లు, 1 సిక్స్‌), రింకూ సింగ్‌ (22 బంతుల్లో 48 నాటౌట్‌, 2 ఫోర్లు, 5 సిక్సర్లు) వేగంగా ఆడటంతో మొదట బ్యాటింగ్‌ చేసిన భారత్‌ నిర్ణీత 20 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 234 పరుగుల రికార్డు స్కోరు చేసింది. భారీ ఛేదనలో జింబాబ్వే 18.4 ఓవర్లలో 134 పరుగులకే ఆలౌట్‌ అయింది. వెస్లీ మద్విర (39 బంతుల్లో 43, 3 ఫోర్లు, 1 సిక్స్‌) టాప్‌ స్కోరర్‌. భారత బౌలర్లలో ముకేశ్‌ కుమార్‌ (3/37), అవేశ్‌ ఖాన్‌ (3/15), రవి బిష్ణోయ్‌ (2/11) రాణించారు. అభిషేక్‌కు ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ అవార్డు లభించింది.

అభిషేక్‌ తుఫాను:టాస్‌ నెగ్గి మొదట బ్యాటింగ్‌ చేసిన భారత్‌ రెండో ఓవర్లోనే కెప్టెన్‌ శుభ్‌మన్‌ గిల్‌ (2) వికెట్‌ను కోల్పోయింది. కానీ అతడి స్థానంలో వచ్చిన రుతురాజ్‌తో కలిసి అభిషేక్‌ భారత ఇన్నింగ్స్‌ను చక్కదిద్దాడు. ఎదుర్కున్న తొలి బంతినే డీప్‌ బ్యాక్‌వర్డ్‌ స్కేర్‌ దిశగా భారీ సిక్సర్‌తో ఖాతా తెరిచిన అతడు.. గిల్‌ నిష్క్రమణ తర్వాత జోరు తగ్గించాడు. కానీ అది తుఫాను ముందు ప్రశాంతతే. 8వ ఓవర్‌ తర్వాత మొదలైంది అసలు విధ్వంసం. సికిందర్‌ రజా వేసిన 9వ ఓవర్లో 4, 6తో బాదుడుకు శ్రీకారం చుట్టిన అభిషేక్‌.. డియోన్‌ 11వ ఓవర్లో ఫోర్‌, సిక్సర్‌తో 33 బంతుల్లోనే అర్ధ సెంచరీ పూర్తిచేశాడు. ఆ తర్వాత వరుసగా 4, 6, 4 సాధించి ఆ ఓవర్లో 28 పరుగులు పిండుకున్నాడు. రజా 13వ ఓవర్లో రెండు ఫోర్లు, సిక్సర్‌తో 82 పరుగుల వద్దకు చేరుకున్నాక మసకద్జ వేసిన మరుసటి ఓవర్లోనే హ్యాట్రిక్‌ సిక్సర్లతో 46 బంతుల్లోనే అంతర్జాతీయ కెరీర్‌లో తొలి శతకాన్ని పూర్తిచేశాడు. రెండో ఫిఫ్టీకి అతడు తీసుకున్న బంతులు 13 మాత్రమే. సెంచరీ అయ్యాక మరుసటి బంతికే పెవిలియన్‌ చేరడంతో 137 పరుగుల రెండో వికెట్‌ భాగస్వామ్యానికి తెరపడింది. ఆ తర్వాత రుతురాజ్‌కు రింకూ జతకలవడంతో భారత స్కోరు వాయువేగాన్ని తలపించింది. 38 బంతుల్లో ఫిఫ్టీ పూర్తిచేసుకున్న రుతురాజ్‌.. చటారా వేసిన 18వ ఓవర్లో ఓ సిక్సర్‌,మూడు బౌండరీలు బాదా డు. ఆఖరి ఓవర్లో రింకూ 2 భారీ సిక్సర్లు కొట్టాడు.

ముకేశ్‌, అవేశ్‌ ధాటికి విలవిల

కొండంత లక్ష్యాన్ని ఛేదించేందుకు క్రీజులో దిగిన జింబాబ్వే ఇన్నింగ్స్‌ మూడో బంతికే ఓపెనర్‌ కైయా (4) వికెట్‌ కోల్పోయింది. 3 సిక్సర్లు బాదిన బెన్నెట్‌ కూడా ముకేశ్‌ మూడో ఓవర్లో ఆఖరి బంతికి క్లీన్‌ బౌల్డ్‌ అయ్యాడు. 4వ ఓవర్లో బంతినందుకున్న అవేశ్‌ 4బంతుల వ్యవధిలో మైయర్స్‌, రజాను ఔట్‌ చేసి జింబాబ్వేను కోలుకోనీయకుండా చేశాడు. ఈ క్రమంలో జొనాథన్‌ (10) అండంతో వెస్లీ కొద్దిసేపు వికెట్ల పతనాన్ని అడ్డుకున్నాడు. కానీ బిష్ణోయ్‌ అతడిని క్లీన్‌ బౌల్డ్‌ చేశాడు. లోయరార్డర్‌ బ్యాటర్‌ లూక్‌ జాంగ్వి (33) కాస్త ప్రతిఘటించడంతో జిం బాబ్వే ఆ మాత్రం స్కోరైనా చేయగలిగిం ది. ఇరుజట్ల మధ్య మూడో టీ20 బుధవారం ఇదే వేదికపై జరుగనుంది.

  • భారత్‌ తరఫున టీ20లలో ఆడిన రెండో మ్యాచ్‌కే శతకం చేసిన మొదటి బ్యాటర్‌ అభిషేక్‌. దీపక్‌ హుడా (3), కెఎల్‌ రాహుల్‌ (4) తదుపరి స్థానాల్లో ఉన్నారు.
  • బంతులపరంగా అభిషేక్‌ది నాలుగో వేగవంతమైన సెంచరీ. రోహిత్‌ (35), సూర్య (45), కెఎల్‌ రాహుల్‌ (46) ముందున్నారు.
  • ఈ ఫార్మాట్‌లో జింబాబ్వేను వంద పరుగుల తేడాతో ఓడించిన రెండో జట్టు భారత్‌. తొలి స్థానం ఆసీస్‌ది.

సంక్షిప్త స్కోర్లు

భారత్‌: 20 ఓవర్లలో 234/2 (అభిషేక్‌ 100, రుతురాజ్‌ 77 నాటౌట్‌, ముజర్బని 1/30, మసకద్జ 1/29)

జింబాబ్వే: 18.4 ఓవర్లలో 134 ఆలౌట్‌ (వెస్లీ 23, జాంగ్వి 33, అవేశ్‌ 3/15, ముకేశ్‌ 3/37)

2024-07-08T00:16:38Z dg43tfdfdgfd