Team India | ఢిల్లీ: తీవ్ర వేదనను మిగిల్చిన బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ పరాభవం నుంచి ఇప్పుడిప్పుడే తేరుకుంటున్న భారత క్రికెట్ జట్టు ఎదుట మరో కఠిన సవాల్! వచ్చే నెల పాకిస్థాన్, దుబాయ్ వేదికలుగా జరగాల్సి ఉన్న ప్రతిష్టాత్మక ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ కోసం ఈనెల 12 లోపు ప్రాథమిక జట్టును ప్రకటించాల్సి ఉంది. అంతకంటే ముందే స్వదేశంలో ఇంగ్లండ్‌తో జరుగబోయే మూడు వన్డేల సిరీస్‌తో పాటు చాంపియన్స్ ట్రోఫీకీ నేడో రేపో సెలెక్టర్లు జట్టును ప్రకటించే అవకాశముంది. ఇంగ్లండ్‌తో సిరీస్ ఆడిన జట్టునే చాంపియన్స్ ట్రోఫీలోనూ ఆడించే చాన్స్ ఉంది. అయితే ఈ టోర్నీలో ఎవరిని ఆడించాలి? పేలవ ఫామ్‌తో తీవ్ర విమర్శల పాలవుతున్న సారథి రోహిత్ శర్మ, స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీని కొనసాగించాలా.. వద్దా? వన్డే వరల్డ్ కప్ తర్వాత జట్టుకు దూరమైన షమీ పూర్తి ఫిట్‌నెస్ అందుకున్నాడా? కేఎల్ రాహుల్, రిషభ్ పంత్‌లో వికెట్ కీపర్‌గా ఎవరికి అవకాశం దక్కనుంది? సీనియర్ స్పిన్నర్ రవీంద్ర జడేజా తుది జట్టులో ఉంటాడా? వంటి ప్రశ్నలతో సెలెక్టర్లకు కొత్త తలనొప్పులు ఎదురుకాబోతున్నాయి.
రెండేండ్ల క్రితం భారత్‌లో ముగిసిన వన్డే ప్రపంచకప్‌లో అదిరిపోయే ఫామ్‌తో ఆకట్టుకుని, గతేడాది టీ20 ప్రపంచకప్‌లోనూ రాణించిన భారత స్టార్ బ్యాటర్లు రోహిత్, కోహ్లీ ఆ తర్వాత దారుణంగా విఫలమవుతున్నారు. ఇటీవల ముగిసిన ఆసీస్ సిరీస్ వారి వైఫల్యానికి పరాకాష్ట. పేలవ ఫామ్‌తో తీవ్ర విమర్శల పాలవుతూ సిడ్నీ టెస్టులో తనంత తానుగా తుది జట్టు నుంచి తప్పుకోవాల్సిన పరిస్థితి రోహిత్‌కు వచ్చింది. ఇందుకు కోహ్లీ కూడా మినహాయింపు కాదు. ఆస్ట్రేలియా సిరీస్ తర్వాత ఈ ఇద్దరూ రిటైర్మెంట్ ప్రకటించాలని డిమాండ్లు వెళ్లువెత్తినా బీసీసీఐ మాత్రం ఈ ఇద్దరికీ ఆఖరి అవకాశం ఇచ్చేందుకు మొగ్గుచూపినట్లు సమాచారం. వన్డే ఫార్మాట్‌లో ఈ ద్వయానికి ఉన్న రికార్డులు, అనుభవం దృష్ట్యా ‘రోకో’పై చర్యలేమీ ఉండబోవని, ఈ ఇద్దరూ చాంపియన్స్ ట్రోఫీలో కొనసాగనున్నట్టు బోర్డు వర్గాలు తెలిపాయి. రోహితే జట్టును నడిపిస్తాడు. ఇటీవల నిలకడగా రాణిస్తున్న జైస్వాల్‌ను రోహిత్‌కు ఓపెనర్‌గా బరిలోకి దించే యోచనలో జట్టు మేనేజ్‌మెంట్ ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి.
సీనియర్ ఆటగాైళ్లెన రాహుల్, షమీ, జడేజా, రిషభ్, అక్షర్‌లో ఎవరిని తుది జట్టులో ఆడిస్తారనేది ఆసక్తికరంగా మారింది. వన్డే వరల్డ్ కప్‌లో రాహుల్, షమీ అంచనాలకు మించి రాణించారు. కానీ ఆ తర్వాత భారత్ ఆడిన ఆరు వన్డేలకూ షమీ దూరమయ్యాడు. ఆస్ట్రేలియా సిరీస్ మధ్యలో అయినా ఆడతాడనుకుంటే మోకాలి వాపు తిరగబెట్టడంతో అతడు మళ్లీ ఎన్‌సీఏకు వెళ్లాడు. అయితే ప్రస్తుతం విజయ్ హజారే ట్రోఫీలో ఆడుతున్న అతడి ఫిట్‌నెస్‌ను దగ్గర్నుంచి సమీక్షిస్తున్న బీసీసీఐ మెడికల్ టీమ్.. షమీకి క్లీన్‌చిట్ ఇవ్వనున్నట్టు తెలుస్తోంది. ఇంగ్లండ్‌తో జరుగబోయే మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో షమీని ఆడించనున్నట్టు వినికిడి. ఆస్ట్రేలియా టెస్టు సిరీస్‌లో అంచనాలను అందుకోలేకపోయినా రాహుల్ మరీ చెత్త ప్రదర్శనలైతే నమోదు చేయలేదు.
అయితే వికెట్ కీపర్ కోటాలో రాహుల్‌కు పంత్ నుంచి గట్టి పోటీ ఎదురవుతోంది. మరోవైపు పంత్ కూడా గొప్పగా రాణించింది లేదు. బ్యాటర్ కోటాలో అయితే రాహుల్‌కు అవకాశం లేకపోయినప్పటికీ వికెట్ కీపర్ కోటాలో మాత్రం అతడు పోటీలో ఉన్నాడు. ఈ ఇద్దరిలో సెలెక్టర్ల మొగ్గు ఎవరి వైపు అన్నది త్వరలో తేలనుంది. ఇక సీనియర్ స్పిన్ ఆల్‌రౌండర్ జడేజా బ్యాటింగ్ వన్డేలలో అంత గొప్పగా ఏం లేదు. అతడి స్థానంలో అక్షర్ పటేల్‌ను జట్టులోకి తీసుకునే అవకాశమున్నట్టు తెలుస్తోంది. కుల్దీప్ యాదవ్ ఫిట్‌గా లేకుంటే వాషింగ్టన్ సుందర్‌కు తలుపులు తెరుచుకున్నట్టే.
ఆసీస్ పర్యటనలో అదరగొట్టిన తెలుగు కుర్రాడు నితీశ్‌కుమార్‌రెడ్డి వైపు సెలెక్టర్లు మొగ్గు చూపుతున్నట్టు బోర్డు వర్గాల సమాచారం. సీమ్ బౌలింగ్ ఆల్‌రౌండర్ల కోటాలో హార్దిక్ పాండ్యాకు జతగా అతడిని తీసుకుంటే బ్యాటింగ్‌తో పాటు బౌలింగ్ బలోపేతమవుతుంది.
2025-01-08T21:00:18Z