Sydney Ground | భారత్, ఆస్ట్రేలియా మధ్య బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో తలపడిన విషయం తెలిసిందే. ఐదు టెస్టులకు ఆతిథ్యం ఇచ్చిన పిచ్‌లకు ఐసీసీ రేటింగ్ ఇచ్చింది. నాలుగు పిచ్‌లు అద్భుతమని.. సిడ్నీ పిచ్‌కు ‘సంతృప్తికరమైంది’గా రేటింగ్ ఇచ్చిందని క్రికెట్ ఆస్ట్రేలియా బుధవారం తెలిపింది. ఆస్ట్రేలియా ఐదు మ్యాచ్‌ల సిరీస్‌ను 3-1 తేడాతో గెలుపొందిన విషయం తెలిసిందే. ప్రపంచ టెస్ట్ చాంపియన్‌షిప్‌కు సైతం అర్హత సాధించింది. పెర్త్‌లోని ఆప్టస్ స్టేడియం, అడిలైడ్‌లోని ఓవల్, బిస్బేన్‌లోని గబ్బా, మెల్‌బోర్న్ క్రికెట్ గ్రౌండ్‌లోని పిచ్‌లకు అత్యధిక రేటింగ్ పాయింట్లు పొందాయని క్రికెట్ ఆస్ట్రేలియా ఓ ప్రకటనలో పేర్కొంది.
అదే సమయంలో సిడ్నీ క్రికెట్ గ్రౌండ్ పిచ్‌కు సంతృప్తికరంగా ఉందంటూ రేటింగ్ ఇచ్చిందని చెప్పింది. వాస్తవానికి సిడ్నీ పిచ్ ఈ సారి బౌలర్లకు బాగా ఉపకరించింది. దాంతో బ్యాట్స్‌మెన్ పరుగులు తీసేందుకు ఇబ్బందిపడ్డారు. క్రికెట్ ఆస్ట్రేలియా క్రికెట్ ఆపరేషన్స్ చీఫ్ పీటర్ రోచ్ మాట్లాడుతూ ఆయా మైదానాల్లో ప్రత్యేకతను తెలిపే పిచ్‌లను సిద్ధం చేసేందుకు తాము ప్రయత్నిస్తామన్నారు. తాము ఆతిథ్య జట్టుకు అనుకూలంగా, సహకరించేలా పిచ్‌లను సిద్ధం చేయమన్నారు. బ్యాట్‌కు, బంతికి మధ్య మంచి పోటీ ఉండేలా చూస్తామన్నారు. వాతావరణం సన్నాహకాలను ప్రభావితం చేసిందని.. ఎంత నైపుణ్యం కలిగిన క్యూరేటర్లయినా ప్రతికూల వాతావరణంతో ప్రభావితమవుతారని తమకు తెలుసునని పేర్కొన్నారు. ఇక సిడ్నీ పిచ్‌పై భారత క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ విమర్శలు గుప్పించారు.
పిచ్‌ను చూసిన సమయంలో ఆవులు మేయవచ్చని, ఇది సరైన టెస్ట్ మ్యాచ్ పిచ్ కాదని చెప్పానన్నారు. ఎందుకంటే మ్యాచ్ నాలుగు, ఐదురోజులు జరగాలని కోరుకుంటారన్నారు. ఇలాంటి పిచ్‌ను భారత్‌లో సిద్ధం చేస్తే ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ క్రికెటర్లు విమర్శించే వారని గవాస్కర్ పేర్కొన్నారు. భారత్ ఎప్పుడూ పిచ్‌లపై ఫిర్యాదు చేయడం కనిపించదన్నారు. భారత్‌లో ఒక రోజులో 15 వికెట్లు కోల్పోవడం నరకంగా ఉండేదన్నారు. ఇక గ్లెన్ మెక్‌గ్రాత్ సైతం పిచ్‌పై ఇంత వరకు భారీగా గ్రాస్‌ను చూడలేదన్నారు. టీమిండియా హెడ్‌కోచ్ గంభీర్ మాట్లాడుతూ.. మనం సాధారణంగా చూసే.. ఇంతకు ముందు చూసిన వికెట్ కాదన్నారు.
2025-01-08T10:30:05Z