Srilanka Cricket : పొట్టి వరల్డ్ కప్‌లో లీగ్ దశలోనే నిష్క్రమించిన శ్రీలంక (Srilanka) జట్టు రాత మారబోతోంది. నిరుడు ఆసియా కప్, వన్డే వరల్డ్ కప్ నుంచి వైఫల్యాల బాటలో నడుస్తున్న లంకను గాడీలో పెట్టేందుకు కొత్త కోచ్ వస్తున్నాడు. అతడు ఎవరో కాదు ఆ దేశ వెటరన్ ఆటగాడు సనత్ జయసూర్య (Sanath Jayasuriya). అవును.. శ్రీలంక ప్రధాన కోచ్‌గా జయసూర్య నియామకం ఖాయమైందని సమాచారం. ఈ విషయాన్ని సోమవారం అతడే స్వయంగా వెల్లడించాడు.
‘హెడ్‌కోచ్‌గా ఉండాలని లంక బోర్డు నన్ను కోరింది. ఆ జాబ్ చేపట్టేందుకు నేను సిద్ధంగా ఉన్నాను’ అని జయసూర్య తెలిపాడు. శ్రీలంక బోర్డు కూడా లెజెండరీ క్రికెటర్‌కు బాధ్యతలు అప్పగిస్తున్నట్టు ధ్రువీకరించింది. ‘జయసూర్యను తాత్కాలికి హెడ్‌కోచ్‌గా నియమిస్తున్నామని ప్రకటిస్తున్నందుకు సంతోషంగా ఉంది.
ఈ ఏడాది సెప్టెంబర్‌లో లంక జట్టు ఇంగ్లండ్ పర్యటన (England Tour) వరకు అతడు కోచ్‌గా ఉంటాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో సుదీర్ఘ అనుభవం గల జయసూర్య శ్రీలంకకు శాశ్వత పరిష్కారం దొరికేంత వరకూ పదవిలో కొనసాగుతాడు. అతడు జాతీయ జట్టును చక్కగా నడిపిస్తాడని నమ్ముతున్నాం’ అని బోర్డు వివరించింది. గతంలో జయసూర్య నేషనల్ సెలెక్టర్‌గా పనిచేశాడు. ప్రస్తుతం కన్సల్టెంట్‌గా సేవలందిస్తున్నాడు.
టీ20 వరల్డ్ కప్‌లో లంక లీగ్ దశలోనే ఇంటికి వెళ్లింది. దాంతో, ‘నేను ఈ జట్టుకు కోచ్‌గా ఉండలేనంటూ’ క్రిస్ సిల్వరహుడ్ (Chris Silverhood) తన పదవికి రాజీనామా చేశాడు. వచ్చే ఏడాది చాంపియన్స్ ట్రోఫీ.. ఆ మరుసటి ఏడాది పొట్టి ప్రపంచ కప్ వంటి మెగా టోర్నీలు ఉండడంతో లంక బోర్డు దేశీయ కోచ్ వైపే మొగ్గు చూపింది. వరల్డ్ కప్ హీరో అయిన జయసూర్యను సంప్రదించింది.
మసకబారుతున్న లంక క్రికెట్‌కు పూర్వ వైభవం తెచ్చేందుకు తాను సిద్ధమే అంటూ జయసూర్య ఒకే చెప్పేశాడు. ప్రపంచంలోని విధ్వంసక ఆటగాడిగా పేరొందని జయసూర్య 2007 టెస్టులకు వీడ్కోలు పలికాడు. ఆ తర్వాత నాలుగేండ్లకు వన్డేలకు రిటైర్మెంట్ ప్రకటించాడు.