SOPHIE DEVINE : డబ్ల్యూపీఎల్ 2023లో ఆర్సీబీ రికార్డ్ ఛేదన.. డివైన్ సిక్సర్ల వర్షం

ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ (WPL)లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) టీమ్ వరుసగా రెండో విజయాన్ని అందుకుంది. సీజన్ ఆరంభంలోనే వరుసగా ఐదు మ్యాచ్‌ల్లో ఓడిపోయిన ఢీలాపడిన ఆర్సీబీ.. రెండు రోజుల క్రితం యూపీ వారియర్స్‌ని ఓడించి బోణి కొట్టింది. తాజాగా శనివారం రాత్రి గుజరాత్ జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 189 పరుగుల లక్ష్యాన్ని 15.3 ఓవర్లలోనే ఛేదించి ఔరా అనిపించింది. ఛేదనలో ఆర్సీబీ ఓపెనర్ సోఫి డివైన్ (99: 36 బంతుల్లో 9x4, 8x6) సిక్సర్ల వర్షం కురిపించేసింది. ఒక్క పరుగు తేడాతో ఆమెకి శతకం చేజారినా.. అప్పటికే మ్యాచ్ పూర్తిగా బెంగళూరు చేతుల్లోకి వచ్చేసింది.

189 పరుగుల ఛేదనలో బెంగళూరు కెప్టెన్ స్మృతి మంధాన (37: 31 బంతుల్లో 5x4, 1x6) కాస్త ఆచితూచి ఆడినా.. సోఫి డివైన్ (Sophie Devine) మాత్రం ఫస్ట్ నుంచి టాప్‌ గేర్‌లో ఆడేసింది. దాంతో తొలి వికెట్‌కి ఈ ఓపెనింగ్ జోడి 9.2 ఓవర్లలోనే 125 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పింది. ఈ క్రమంలో సెంచరీ సాధించేలా కనిపించిన డివైన్ ఇన్నింగ్స్ 12వ ఓవర్‌లో కిమ్ గార్త్ బౌలింగ్‌లో ఔటైపోయింది. అనంతరం వచ్చిన పెర్రీ (19 నాటౌట్), హీథర్ నైట్ (22 నాటౌట్) గెలుపు లాంఛనాన్ని 15.3 ఓవర్లలోనే పూర్తి చేసేశారు. ఆర్సీబీ ఓపెనర్ల వికెట్లు మాత్రమే చేజార్చుకుంది. ఇక బెంగళూరు టీమ్ తర్వాత మ్యాచ్‌ని ముంబయి ఇండియన్స్‌తో ఈ నెల 21న ఆడనుంది.

అంతకముందు గుజరాత్ జెయింట్స్ జట్టులో ఓపెనర్ లూరా వోల్వార్డ్ (68: 42 బంతుల్లో 9x4, 2x6) హాఫ్ సెంచరీ నమోదు చేసింది. ఆమెతో పాటు గార్డ్‌నర్ (41: 26 బంతుల్లో 6x4, 1x6) దూకుడుగా ఆడింది. దాంతో గుజరాత్ టీమ్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 188 పరుగులు చేసింది. ఆర్సీబీ బౌలర్లలోడివైన్, ప్రీతి బోస్ చెరో వికెట్ పడగొట్టగా.. శ్రేయాంక రెండు వికెట్లు దక్కాయి.

Read Latest

Sports News

,

Cricket News

,

Telugu News

2023-03-18T17:30:21Z dg43tfdfdgfd