SHUBMAN GILLని ఫైనల్లో అతను ఒక్కడే ఆపగలడు: ఆకాశ్ చోప్రా

గుజరాత్ టైటాన్స్ (GT) యంగ్ ఓపెనర్ శుభమన్ గిల్‌(Shubman Gill)ని ఐపీఎల్ 2023 ఫైనల్లో చెన్నై సూపర్ కింగ్స్ (CSK) బౌలర్ దీపక్ చాహర్ (Deepak Chahar) మాత్రమే ఆపగలడని మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా అభిప్రాయపడ్డారు. చెన్నై, గుజరాత్ మధ్య అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియం వేదికగా ఈరోజు రాత్రి 7:30 గంటలకి ఫైనల్ మ్యాచ్ జరగనుంది. చెన్నై టీమ్‌కి ఇది పదో ఐపీఎల్ ఫైనల్‌కాగా.. గుజరాత్ టీమ్‌కి వరుసగా రెండో ఫైనల్. గత ఏడాది గుజరాత్ టైటాన్స్ విజేతగా నిలిచిన విషయం తెలిసిందే.

ఐపీఎల్ 2023 సీజన్‌లో ఇప్పటికే 16 మ్యాచ్‌లాడిన శుభమన్ గిల్ 156.43 స్ట్రైక్‌రేట్‌తో 851 పరుగులు చేశాడు. ఒకవేళ ఈరోజు ఫైనల్లో చెన్నై సూపర్ కింగ్స్‌పై శుభమన్ గిల్ 123 పరుగులు చేస్తే? విరాట్ కోహ్లీ పేరిట ఉన్న ఐపీఎల్ సీజన్‌లో అత్యధిక పరుగుల రికార్డ్ బద్దలుకానుంది. ఐపీఎల్ 2016 సీజన్‌లో విరాట్ కోహ్లీ 973 పరుగులు చేశాడు. ముంబయి ఇండియన్స్‌తో గత శుక్రవారం రాత్రి జరిగిన క్వాలిఫయర్ -2 మ్యాచ్‌లో గిల్ 60 బంతుల్లో 129 పరుగులు చేశాడు. ఇందులో ఏడు ఫోర్లు, పది సిక్సర్లు ఉన్నాయి.

విరాట్ కోహ్లీ రికార్డ్‌ని శుభమన్ గిల్ బద్దలు కొట్టగలడా? అనే అంశంపై ఆకాశ్ చోప్రా మాట్లాడాడు. ‘‘గిల్ చాలా భిన్నంగా బ్యాటింగ్ చేస్తున్నాడు. ఒకవేళ కోహ్లీ రికార్డ్‌ని అతను బ్రేక్ చేయాలంటే మరోసారి అతను సెంచరీ మార్క్‌ని అందుకోవాల్సి ఉంటుంది. చివరిగా ఆడిన నాలుగు మ్యాచ్‌ల్లోనే మూడు సెంచరీలు బాదిన గిల్‌కి ఇదేమంత కష్టం కాదు. కానీ.. అతనికి చెన్నై బౌలర్ దీపక్ చాహర్‌తో ప్రమాదం పొంచి ఉంది. కొత్త బంతితో అతడ్ని ఎదుర్కోవడం గిల్‌కి పెద్ద ఛాలెంజ్. ఒకవేళ దీపక్ చాహర్‌ని గిల్ ఎదుర్కోగలిగితే.. ఆ రికార్డ్ సాధ్యమే’’ అని ఆకాశ్ చోప్రా చెప్పుకొచ్చాడు.

2023-05-28T10:31:57Z dg43tfdfdgfd