NZ VS ENG: ఇండియాతో టెస్టు సిరీస్‌లో హీరో.. ఇంగ్లాండ్‌తో తొలి టెస్టుకు నో ప్లేస్..!

భారత గడ్డ మీద మూడు టెస్టుల సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేసిన న్యూజిలాండ్ జట్టు.. సొంత గడ్డ మీద ఇంగ్లాండ్‌తో మూడు టెస్టుల సిరీస్‌లో తలపడనుంది. గురువారం క్రైస్ట్‌చర్చ్ వేదికగా తొలి టెస్టు ప్రారంభం కానుంది. గాయం కారణంగా భారత్‌తో టెస్టు సిరీస్‌కు దూరమైన కివీస్ స్టార్ బ్యాటర్ కేన్ విలియమ్సన్.. ఈ మ్యాచ్‌ ద్వారా తిరిగి జట్టులో భాగం కానున్నాడు.కేన్ విలియమ్సన్ తిరిగి టెస్టు్ల్లోకి అడుగుపెట్టడంతో.. ప్రతిభావంతుడైన బ్యాటర్ విల్ యంగ్‌ను న్యూజిలాండ్ తుది జట్టు నుంచి తప్పించాల్సి వచ్చింది. ఇటీవల భారత్‌తో జరిగిన మూడు టెస్టుల సిరీస్‌లో న్యూజిలాండ్ విజయంలో కీలక పాత్ర పోషించిన యంగ్.. ప్లేయర్ ఆఫ్ ది సిరీస్‌గా ఎంపికయ్యాడు. భారత్‌తో జరిగిన మూడు టెస్టుల్లో విల్ యంగ్.. ఆరు ఇన్నింగ్స్‌ల్లో 48.80 యావరేజ్‌తో 244 పరుగులు చేశాడు. అయినా సరే ఇంగ్లాండ్‌తో తొలి టెస్టులో అతడికి ఆడే అవకాశం దక్కకపోవడం గమనార్హం.చివరగా శ్రీలంకతో టెస్టు సిరీస్ ఆడిన కేన్ విలియమ్సన్.. రెండు టెస్టుల్లో 55, 30, 7, 46 చొప్పున పరుగులు చేశాడు. కానీ గాయం కారణంగా భారత్‌తో టెస్టు సిరీస్‌కు దూరమయ్యాడు. విల్ యంగ్‌ను తుది జట్టు నుంచి తప్పించడం కఠిన నిర్ణయమన్న కెప్టెన్ టామ్ లేథమ్.. భారత్‌తో సిరీస్‌లో అతడు గొప్పగా రాణించాడని కొనియాడారు. అయితే కేన్ విలియమ్సన్ లాంటి ఆటగాడు తిరిగి ఆడుతుండటం తమ అవకాశాలను మరింత మెరుగపరుస్తుందని లేథమ్ అభిప్రాయపడ్డాడు.విల్ యంగ్‌కు ఇంగ్లాండ్‌తో తొలి టెస్టులో ఆడే అవకాశం రాలేదని తెలిసి నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. కేన్ లాంటి సీనియర్ ఆటగాడి కోసం యంగ్‌ను పక్కనబెట్టడం తప్పులేదని కొందరు అభిప్రాయపడగా.. మరి కొందరు మాత్రం ఇద్దర్నీ ఎందుకు ఆడించడం లేదని ప్రశ్నిస్తున్నారు.ఇంగ్లాండ్‌తో తొలి టెస్టు‌లో ఆల్‌రౌండర్‌ నాథన్ స్మిత్‌ న్యూజిలాండ్ తరఫున బరిలోకి దిగనున్నాడు. ఫస్ట్ క్లాస్ ప్లంకెట్ షీల్డ్ కాంపిటీషన్‌లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా నిలిచిన నాథన్ స్మి్త్‌కు.. తొలిసారి న్యూజిలాండ్ తరఫున టెస్టుల్లో ఆడే అవకాశం లభించింది. క్రైస్ట్‌చర్చ్ టెస్టులో నాలుగో పేస్ బౌలింగ్ ఆప్షన్‌గా నాథన్‌ను కివీస్ జట్టులోకి తీసుకున్నారు.మరోవైపు క్రైస్ట్‌చర్చ్ టెస్టులో ఇంగ్లాండ్ తరఫున జాకబ్ బెథెల్ టెస్టుల్లోకి అరంగేట్రం చేయనున్నాడు. ఇటీవల జరిగిన ఐపీఎల్ మెగా వేలంలో బెథెల్‌ను రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు రూ.2.6 కోట్లకు కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే.

ఇంగ్లాండ్‌తో తొలి టెస్టుకు న్యూజిలాండ్ జట్టు:

టామ్ లేథమ్ (కెప్టెన్), డెవాన్ కాన్వే, కేన్ విలియమ్సన్, రచిన్ రవీంద్ర, డారెల్ మిచెల్, టామ్ బ్లండెల్ (వికెట్ కీపర్), గ్లెన్ ఫిలిప్స్, నాథన్ స్మిత్, మ్యాట్ హెన్రీ, టిమ్ సౌథీ, విల్ ఓరౌర్కీ.

2024-11-27T11:33:12Z