Nita Ambani : అపర కుబేరుడు, రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ (Anant Ambani) పెండ్లి సంబురం వైభవంగా జరుగుతోంది. అనంత్ – రాధికా మర్చంట్‌ల సంగీత్ వేడుక శుక్రవారం రాత్రి కన్నులపండువగా జరిగింది. ఈ వేడుకలో పొట్టి ప్రపంచ కప్ విజేతలు రోహిత్ శర్మ (Rohit Sharma), సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఐసీసీ ట్రోఫీతో స్వదేశం వచ్చిన ఈ ముగ్గురిని చూసిన ముంబై ఇండియన్స్ ఫ్రాంచైజీ యజమాని నీతా అంబానీ(Nita Ambani) ఎమోషనల్ అయింది.
‘ఇక్కడున్న మనమంతా ఒక కుటుంబం. అయితే.. నాకు మరో ఫ్యామిలీ ఉంది. ఆ కుటుంబం దేశంలోని ప్రతిఒక్కరి గుండెలు గర్వంతో ఉప్పొంగేలా చేసింది. ముంబై ఇండియన్స్ ఫ్యామిలీ ఈరోజు రాత్రి మనతో ఉన్నందుకు నేను ఎంతో సంతోషిస్తున్నానో మాటల్లో చెప్పలేను. ఈ రాత్రి సంబురాల రోజు. అదే సమయంలో అనంత్, రాధికల సంగీత్ వేడుక కూడా. ఈ సమయంలో మనమంతా దేశం తరఫున సెలబ్రేట్ చేసుకుందాం’ అని నీతా గెస్ట్‌లతో చెప్పింది.
ఆ తర్వాత ఈ ముంబై త్రయాన్ని ఆమె వేదిక మీదకు ఆహ్వానించింది. దాంతో, ఆమె పెద్ద కుమారుడు ఆకాశ్ స్వయంగా రోహిత్, సూర్య, పాండ్యాలను స్టేజిమీదకు తీసుకొచ్చాడు. ఆ సమయంలో అక్కడున్న అతిథులంతా స్టాండింగ్ ఒవేషన్‌తో జగజ్జేతలకు స్వాగతం పలికారు. ఈ ముగ్గురిని ప్రేమగా హత్తుకున్న నీతా ఒక్కసారిగా భావోద్వేగానికి లోనైంది. కరీబియన్ గడ్డపై భారత జట్టు అద్భుత విజయం గురించి మాట్లాడుతూ ఎమోషనల్ అయిన ఆమె కన్నీళ్లు పెట్టుకుంది. ముంబై ఫ్రాంచైజీ ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేసిన ఆ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. అనంత్, రాధికల సంగీత్ వేడుకలో క్రికెట్, బాలీవుడ్ సెలబ్రిటీలు సందడి చేశారు. మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ సతీ సమేతంగా హాజరయ్యాడు.