IND VS AUS: తొలి వన్డేకు రోహిత్ శర్మ దూరం.. ఇలాగైతే ఎలా కెప్టెన్..?

ఆస్ట్రేలియాతో జరిగిన టెస్టు సిరీస్‌ను 2-1 తేడాతో గెలుచుకున్న భారత్.. శుక్రవారం నుంచి మూడు వన్డేల సిరీస్‌తో తలపడనుంది. ముంబైలోని వాంఖడే వేదికగా తొలి వన్డే శుక్రవారం మధ్యాహ్నం ప్రారంభం కానుంది. కాగా టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ మొదటి మ్యాచ్‌కు దూరం కానున్నాడు. తన బామ్మర్ది వివాహం కారణంగానే హిట్ మ్యాన్ తొలి వన్డే ఆడటం లేదని తెలుస్తోంది. దీంతో రోహిత్ స్థానంలో హార్దిక్ పాండ్య టీమిండియా కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. ఫిబ్రవరి 19న వన్డే జట్టును ప్రకటించిన సమయంలో బీసీసీఐ ఈ విషయాన్ని వెల్లడించింది.

టీ20 వరల్డ్ కప్ ముగిసిన తర్వాత పొట్టి ఫార్మాట్లో హార్దిక్ పాండ్యనే భారత జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరిస్తోన్న సంగతి తెలిసిందే. రోహిత్ శర్మ రెగ్యులర్ కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఫిట్‌నెస్ సమస్యలు, ఇతర కారణాలతో అనేక సందర్భాల్లో మ్యా్చ్‌లకు దూరమయ్యాడు. దీంతో ఏడాది కాలంలో టీమిండియాకు ఏడుగురు కెప్టెన్లుగా వ్యవహరించారు. 2023లో మాత్రం ఇప్పటి వరకూ రోహిత్, హార్దిక్ మాత్రమే కెప్టెన్లుగా వ్యవహరించారు. ఈ ఏడాది చివర్లో వన్డే వరల్డ్ కప్ జరగనుండటంతో.. రోహిత్ శర్మ అన్ని మ్యాచ్‌లు ఆడాలని.. అప్పుడే జట్టు కూర్పు, సన్నద్ధత బాగుంటుందని అజిత్ అగార్కర్ లాంటి మాజీ క్రికెటర్లు సూచిస్తున్నారు. ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్ ముగిసిన తర్వాత ఐపీఎల్ 2023 ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే.

కాగా తొలి వన్డే కోసం భారత క్రికెటర్లు ఇప్పటికే ముంబై చేరుకున్నారు. టెస్టు జట్టులో సభ్యులుగా ఉన్న విరాట్ కోహ్లి, శుభ్‌మన్ గిల్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, రోహిత్ శర్మ తదితరులు మంగళవారమే ముంబై చేరుకున్నారు. గాయం కారణంగా దాదాపు ఏడు నెలల విరామం తర్వాత జడేజా వన్డే క్రికెట్ ఆడనున్నాడు. దాదాపు పదేళ్ల విరామం తర్వాత ఫాస్ట్ బౌలర్ జయదేవ్ ఉనద్కత్ వన్డే జట్టులో చోటు దక్కించుకున్న సంగతి తెలిసిందే. ఆ తర్వాత జూన్ నెలలో డబ్ల్యూటీసీ ఫైనల్ జరగనుంది.

శ్రేయస్ అయ్యర్‌ను సైతం వన్డే సిరీస్‌కు ఎంపిక చేసినప్పటికీ.. వెన్ను గాయం కారణంగా చివరి టెస్టులో బ్యాటింగ్‌కు దిగని అతడు.. ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్‌కు సైతం దూరమయ్యాడు. కానీ బీసీసీఐ అతడికి రీప్లేస్‌మెంట్‌గా ఎవర్నీ ప్రకటించలేదు.

మరోవైపు ఆస్ట్రేలియా జట్టుకు వన్డేల్లోనూ స్టీవ్ స్మిత్ కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. గాయం కారణంగా ఆస్ట్రేలియా కీలక ఆటగాళ్లు జోష్ హేజిల్‌వుడ్, రిచర్డ్సన్ వన్డేలకు సైతం దూరం కానున్నారు. పర్యాటక జట్టుకు ఇది ఇబ్బందికరం కానుంది.

2023-03-15T07:43:42Z dg43tfdfdgfd