Gautam Gambhir : భారత పురుషుల జట్టుకు కొత్త ప్రధాన కోచ్ ఎవరు? అనే దానిపై ఇంక సందిగ్ధత కొనసాగుతోంది. టీ20 వరల్డ్ కప్‌తో రాహుల్ ద్రవిడ్ కాంట్రాక్ట్ ముగిసినా.. కోచ్ పేరును బీసీసీఐ (BCCI) అధికారికంగా ఖరారు చేయలేదు. మరీ.. కొత్త హెడ్‌కోచ్ పదవికోసం ఇంటర్వ్యూకు సైతం హాజరైన గౌతం గంభీర్ (Gautam Gambhir) నియామకం ఎప్పుడు? అసలు భారత బోర్డు ఎందుకు తాత్సారం చేస్తుంది? అని అభిమానుల్లో పెద్ద చర్చ నడుస్తోంది.
అయితే.. జీతం విషయంలో గంభీర్ మంకు పట్టు పట్టాడని.. అతడిని బుజ్జగించేందుకు బీసీసీఐ ప్రయత్నిస్తోందనే వార్తలు వినిపిస్తున్నాయి. భారత హెడ్‌కోచ్ పోస్ట్ కోసం జూన్‌లోనే గంభీర్‌ను బీసీసీఐ సంప్రదించింది. అందుకు మాజీ ఓపెనర్ సైతం ”ఓకే’ చెప్పేశాడు. అంతేకాదు తనకు నచ్చిన సహాయక సిబ్బందిని తెచ్చుకుంటానని పంతం నెగ్గించుకున్న గంభీర్.. ఇప్పుడు ఎక్కువ జీతం కోసం పేచీ పెట్టినట్టు సమాచారం. వరల్డ్ కప్ హీరోగా కోచ్ పదవి నుంచి వైదొలిగిన రాహుల్ ద్రవిడ్‌కు బీసీసీఐ ఏటా రూ.12 కోట్లు ముట్టజెప్పింది.
ఇప్పుడు గంభీర్‌కు కూడా అంతే మొత్తం ఇవ్వాలని భావించింది. కానీ, ఈ మాజీ ఆటగాడు మాత్రం రేటు పెంచాల్సిందే అంటున్నాడట. దాంతో, అతడితో బీసీసీఐ పెద్దలు చర్చలు జరుపుతున్నారు. ఆ చర్చలు సఫలమయ్యాకే గౌతీని హెడ్‌కోచ్‌గా ప్రకటించే అవకాశముంది. టీమిండియా.. శ్రీలంక సిరీస్‌లోపు గంభర్ బాధ్యతలు చేపడతాడని బీసీసీఐ వర్గాలు అంటున్నాయి. మూడు వన్డేల, మూడు టీ20ల సిరీస్ కోసం టీమిండియా జూలై నెలాఖరులో శ్రీలంక పర్యటనకు వెళ్లనుంది.
మాజీ ఓపెనర్ అయిన గంభీర్ ఐపీఎల్‌లో కెప్టెన్‌గా, మెంటార్‌గా హిట్ కొట్టాడు. ఏడు సీజన్లు కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టుకు సారథి ఉన్న అతడు తన హయాంలో రెండు ట్రోఫీలు అందించాడు. ఇక పదిహేడో సీజన్‌లో మెంటార్‌గా వస్తూనే కోల్‌కతా ట్రోఫీ నిరీక్షణకు తెరదించాడు. దాంతో, బీసీసీఐ పెద్దలు గంభీర్‌ను కోచ్ పదవిని కలిసి హెడ్‌కోచ్‌గా ఉండాలని కోరిన విషయం తెలిసిందే.