DC VS GG | హాఫ్ సెంచ‌రీ కొట్టిన గార్డ్‌న‌ర్, వోల్వార్డ్త్ .. ఢిల్లీ టార్గెట్ 148

DC vs GG : ఢిల్లీ క్యాపిటల్స్‌(Delhi Capitals)తో జ‌ర‌గుతున్న మ్యాచ్‌లో గుజ‌రాత్ జెయింట్స్ (Gujarat Gaiants) పోరాడ‌గ‌లిగే స్కోర్ చేసింది. నిర్ణీత ఓవ‌ర్ల‌లో 4 వికెట్ల న‌ష్టానికి 147 ప‌రుగులు చేసింది. ఓపెన‌ర్ లారా వోల్వార్డ్త్‌(57), అష్ గార్డ్‌న‌ర్ (51) అర్ధ శ‌త‌కాల‌తో రాణించారు. వీళ్లు దూకుడుగా ఆడి స్కోర్‌బోర్డును ప‌రుగులు పెట్టించారు. ఢిల్లీ బౌల‌ర్ల‌పై విరుచుకుప‌డిన వీళ్లిద్ద‌రూ మూడో వికెట్‌కు 81 ర‌న్స్ జోడించారు. జొనాసెన్ వేసిన 16వ ఓవ‌ర్‌లో వోల్వార్డ్త్ చెల‌రేగింది. ఒక సిక్స్, రెండు ఫోర్లు బాదింది. 15 ర‌న్స్ రావ‌డంతో గుజ‌రాత్ స్కోర్ వంద దాటింది. ఆఖ‌రి ఓవ‌ర్‌లో ఫోర్ బాదిన గార్డ్‌న‌ర్ ఫిఫ్టీ పూర్తి చేసుకుంది. ఢిల్లీ బౌల‌ర్ల‌లో అరుంధ‌తి రెడ్డి, జొనాసెన్, మ‌రిజానే క‌ప్ త‌లా ఒక వికెట్ తీశారు.

ఆదుకున్న గార్డ్‌న‌ర్, వోల్వార్డ్త్

టాస్ ఓడిపోయి బ్యాటింగ్‌కు దిగిన‌ గుజ‌రాత్ జెయింట్స్ మొద‌టి ఓవ‌ర్‌లోనే వికెట్ కోల్పోయింది. ఓపెన‌ర్ సోఫీ డంక్లీ (4) ఔట్ అయింది. మ‌రిజానే కాప్ వేసిన ఆఖ‌రి బంతికి లాంగాఫ్‌లో క్యాచ్ ఇచ్చి వెనుదిరిగింది. కుదురుకున్న‌ హ‌ర్లీన్ డియోల్ (31) ను జొనాసెన్ రెండో వికెట్‌గా వెన‌క్కి పంపింది. దాంతో, గుజ‌రాత్ జ‌ట్టు 53 ర‌న్స్ వ‌ద్ద రెండో వికెట్ కోల్పోయింది. ఆ త‌ర్వాత‌.. ఓపెన‌ర్ లారా వోల్వార్డ్త్‌, అష్ గార్డ్‌న‌ర్ గుజ‌రాత్‌ను ఆదుకున్నారు. తొలి మ్యాచ్‌లో విఫ‌ల‌మైన ఆమె కీల‌క మ్యాచ్‌లో రాణించింది. డ‌బ్ల్యూపీఎల్‌లో తొలి హాఫ్ సెంచ‌రీ న‌మోదు చేసింది. 41 బంతుల్లోనే 5 ఫోర్లు, ఒక సిక్స‌ర్‌తో ఫిఫ్టీ కొట్టింది. అష్ గార్డ్‌న‌ర్‌తో మూడో వికెట్‌కు 81ప‌రుగులు జోడించింది. గార్డ్‌న‌ర్ 33 బంతుల్లో 9 ఫోర్ల‌తో 51 ర‌న్స్ చేసింది.

2023-03-16T15:35:29Z dg43tfdfdgfd