Champions Trophy 2025 | చాంపియన్స్ ట్రోఫీకి సమయం దగ్గరపడుతున్నది. ఈ క్రమంలో జట్టు కూర్పుపై అభిమానుల్లో ఉత్కంఠ నెలకొన్నది. మినీ వరల్డ్‌కప్‌గా భావించే.. ఈ మెగా టోర్నీ ఈ ఏడాది పాకిస్థాన్, యూఏఈ వేదికగా జరుగనున్నది. ఫిబ్రవరి 19 నుంచి మొదలవనుండగా.. ఈ టోర్నీకి బీసీసీఐ ఇంకా జట్టును ప్రకటించలేదు. ఆస్ట్రేలియాలో టెస్ట్ ఓటమి తర్వాత సెలెక్టర్లు కూర్పు విషయంలో తీవ్రంగా చర్చించి తుది జట్టును ప్రకటించే ఛాన్స్ ఉంది. అయితే, టెస్టులకు, వన్డేలకు భారీ తేడా ఉంటుంది. ఈ క్రమంలో త్వరలోనే సెలక్షన్ కమిటీ తుది జట్టును ప్రకటించే అవకాశాలు ఉన్నాయి. గతేడాది భారత జట్టు జూన్ తర్వాత ఎక్కువగా వన్డేలు ఆడలేదు.
గౌతమ్ గంభీర్ హెడ్‌కోచ్‌గా బాధ్యతలు స్వీకరించాక భారత జట్టు కేవలం ఒక వన్డే సిరీస్ మాత్రమే ఆడింది. శ్రీలంకతో జరిగిన మూడు వన్డేల సిరీస్‌లో టీమిండియా ఓటమిపాలైంది. ఆ సమయంలో సెలెక్టర్లు దాదాపుగా జట్టులో కొత్త ముఖాలకు చోటు కల్పించారు. అయితే, ఐసీసీ మెగా ఈవెంట్‌లో పెద్దగా ప్రయోగాలు చేసేందుకు అవకాశం లేదు. రోహిత్ శర్మ కెప్టెన్‌గా కొనసాగే అవకాశాలున్నాయి. అయితే, మిగతా వారిలో ఎవరికి అవకాశం దక్కనుందో చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతం అందరి దృష్టి ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రాపైనే ఉంది. గాయం కారణంగా చాంపియన్స్ ట్రోఫీకి అందుబాటులో ఉంటాడా? లేదా? అన్న అనుమానాలున్నాయి. అయితే, బౌలింగ్ భారమంతా బుమ్రాపైనే ఉన్నది. అలాగే, మహ్మద్ షమీ, హార్దిక్ ప్యాండ్యాలు పునరాగమనం చేసే అవకాశం ఉంది.
చాంపియన్స్ ట్రోఫీకి జట్టును ప్రకటించేందుకు జనవరి 12 చివరి తేదీ. అయితే, మార్పులు చేసేందుకు ఫిబ్రవరి 13 వరకు అవకాశం ఉంటుంది. ఇటీవల కాలంలో భారత క్రికెట్‌లో కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. గతేడాది శ్రీలంకతో జరిగిన వన్డే సిరీస్‌లో వైస్ కెప్టెన్సీ నుంచి హార్దిక్‌ను తప్పించి శుభ్‌మన్ గిల్‌కు ఆ బాధ్యతలు అప్పగించారు. చాంపియన్స్ ట్రోఫీలో హార్దిక్, శుభ్‌మన్ గిల్‌కు కాకుండా మరొకరికి వైస్ కెప్టెన్సీ ఇచ్చేందుకు అవకాశం ఉందని పలు నివేదికలు పేర్కొంటున్నాయి. జస్ప్రీత్ బుమ్రా ఫిట్‌గా ఉంటే.. వైస్ కెప్టెన్సీని బుమ్రాకు ఇచ్చే ఛాన్స్ ఉంది. ఛాంపియన్స్ ట్రోఫీతో పాటు ఇంగ్లండ్‌తో జరగనున్న మూడు వన్డేల సిరీస్‌కు కూడా జట్టును ప్రకటించనున్నారు. వన్డే సిరీస్‌తో పాటు చాంపియన్స్ ట్రోఫీకి ఎంపిక చేసే జట్లలో పెద్దగా మార్పులు ఉండకపోవచ్చని తెలుస్తుంది. ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు ఆటగాళ్లను పరీక్షించేందుకు ఇంగ్లండ్‌తో వన్డే సిరీస్ సన్నాహకంగా ఉపయోగపడనున్నది.
ఫిబ్రవరి 6 నుంచి భారత్, ఇంగ్లండ్ మధ్య వన్డే సిరీస్ ప్రారంభం కానుంది. అయితే, బుమ్రా వైస్ కెప్టెన్‌గా ఉన్నా.. ఇంగ్లండ్‌తో జరిగే వన్డే సిరీస్‌లో పలు మ్యాచులకు దూరమయ్యే అవకాశాలున్నాయి. కేవలం ఒకటి, రెండు వన్డేలకు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం అందరి దృష్టి మరో ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రాపైనే ఉంది. 2023 వన్డే ప్రపంచకప్ తర్వాత షమీ అంతర్జాతీయ క్రికెట్ ఆడలేదు. బోర్డర్ – గవాస్కర్ ట్రోఫీకి ముందు ఫిట్‌నెస్‌ను నిరూపించుకోవడంలో విఫలమయ్యాడు. ఆ తర్వాత రంజీల్లో రాణించాడు. చాంపియన్ ట్రోఫీకి సెలెక్టర్లు అతన్ని తిరిగి జాతీయ జట్టులోకి తీసుకునే అవకాశాలున్నాయి. అలాగే, శ్రీలంకతో జరిగిన చివరి వన్డే సిరీస్‌లో ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యాకు అవకాశం లభించలేదు.
ప్రస్తుతం హార్దిక్ సైతం తిరిగి జట్టులోకి రావచ్చు. శ్రీలంకతో సిరీస్ సందర్భంగా జట్టులోకి వచ్చిన శివమ్ దూబే, రియాన్ పరాగ్‌లను బ్యాకప్‌గా తీసుకునే ఛాన్స్ ఉంది. మరో వైపు నలుగురు స్పిన్నర్లను ఎంపిక ఖాయంగా కనిపిస్తుంది. రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్‌లకు చోటు దక్కే అవకాశాలున్నాయి. బ్యాట్స్‌మెన్‌లో రోహిత్‌తో పాటు శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, రిషబ్ పంత్ ఎంపిక దాదాపు ఖాయమే. కేఎల్ రాహుల్, శ్రేయాస్ అయ్యర్ మధ్య నాలుగో నెంబర్ కోసం పోటీ నెలకొంది. వీరిద్దరు జట్టులో ఉండడం దాదాపు ఖాయంగా కనిపిస్తుంది. ఆల్ రౌండర్లలో నితీశ్‌రెడ్డిని హార్దిక్ పాండ్యా బ్యాకప్‌గా తీసుకునే ఛాన్స్ ఉంది. సుందర్, జడేజా, అక్షర్ స్పిన్ బౌలింగ్ ఆల్‌రౌండర్‌లుగా చోటు దక్కించుకోవచ్చు.
భారత్ మ్యాచ్‌లు దుబాయ్‌లో జరగనున్నందున స్పిన్నర్ల పాత్ర కీలకం కానుంది. ఫాస్ట్ బౌలర్లలో బుమ్రా (ఫిట్‌నెస్ సాధిస్తే ), షమీతో పాటు అర్ష్‌దీప్ సింగ్, మహ్మద్ సిరాజ్‌లను ఎంపిక చేసే అవకాశం ఉంది. యువ ఆటగాడు యశస్వి జైస్వాల్‌కు వన్డేల్లో అవకాశం లభిస్తుందా? అన్నది ఆసక్తికరంగా మారింది. సెలెక్టర్లు రోహిత్‌కు ఓపెనింగ్ జోడీగా శుభ్‌మన్ గిల్‌ను, జైశ్వాల్‌ను ఎంపిక చేస్తారా? వేచి చూడాల్సిందే. ఆస్ట్రేలియా పర్యటనలో జైస్వాల్ ఆకట్టుకున్నాడు. భారత్ తరఫున టాప్ స్కోర్‌గా నిలిచాడు. పంత్‌కు వికెట్ కీపర్‌గా అవకాశం దక్కినా.. కేఎల్ రాహుల్ బ్యాకప్‌గా తీసుకునే అవకాశం ఉంది. ఇక వన్డేల్లోకి సంజూ శాంసన్ ఎంపిక కష్టంగా కనిపిస్తున్నది. సెలెక్టర్లు 15 మంది ఆటగాళ్లనే ఎంపిక చేయనుండగా.. పలువురిని బ్యాకప్‌గా తీసుకునే అవకాశాలున్నాయి.
ఫిబ్రవరిలో ఇంగ్లాండ్ జట్టు భారత్‌లో మూడు వన్డేలు ఆడనున్నది. నాగ్‌పూర్ వేదికగా ఫిబ్రవరి ఒకటిన తొలి వన్డే మొదలవుతుంది. ఇక రెండో వన్డే ఫిబ్రవరి 9న కటక్‌లో, మూడే వన్డే ఫిబ్రవరి 12న అహ్మదాబాద్‌లో జరుగుతుంది.
రోహిత్ శర్మ (కెప్టెన్), జస్ప్రీత్ బుమ్రా (వైస్ కెప్టెన్), శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, రిషబ్ పంత్, శ్రేయాస్ అయ్యర్, కేఎల్ రాహుల్, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్, అక్షర్ పటేల్, కుల్దీప్ సింగ్ యాదవ్, అర్ష్‌దీప్ సింగ్, మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్. అయితే, బుమ్రా ఫిట్‌నెస్ సాధిస్తేనే తుది జట్టులో చోటు దక్కే అవకాశాలుంటాయి. ఇక నితీశ్ రెడ్డి, యశస్వి జైస్వాల్, శివమ్ దూబే, రియాన్ పరాగ్, హర్షిత్ రాణాలను బ్యాకప్‌గా తీసుకునే ఛాన్స్ ఉంది.
2025-01-07T11:44:43Z