CARDIAC ARREST: గుండెపోటుతో మైదానంలోనే క్రికెట‌ర్ మృతి.. వీడియో

పుణె: ఓ క్రికెట‌ర్ గుండెపోటు(Cardiac Arrest) రావ‌డంతో.. మైదానంలోనే కుప్ప‌కూలి ప్రాణాలు వ‌దిలాడు. ఈ ఘ‌ట‌న పుణెలో జ‌రిగింది. న‌గ‌రంలోని గ‌ర్వారి స్టేడియంలో గురువారం జ‌రిగిన మ్యాచ్‌లో.. ఈ ఘ‌ట‌న చోటుచేసుకున్న‌ది. 35 ఏళ్ల బ్యాట‌ర్ ఇమ్రాన్ ప‌టేల్ అక‌స్మాత్తుగా గుండె నొప్పితో కుప్ప‌కూలాడు. ఓపెన‌ర్‌గా వెళ్లి బ్యాటింగ్ చేస్తున్న స‌మ‌యంలో.. ఇమ్రాన్ ప‌టేల్ త‌న ఛాతిలో నొప్పి వ‌స్తున్న‌ట్లు పేర్కొన్నాడు. అంపైర్ల‌కు ఆ విష‌యాన్ని చెప్పాడు. ప్లేయ‌ర్లు కొంత సేపు ఆట నిలిపివేశారు. ఆ త‌ర్వాత మైదానం బ‌య‌ట‌కు వెళ్తున్న స‌మ‌యంలో అత‌ను కుప్ప‌కూలాడు. హుటాహుటిన అత‌న్ని ఆస్ప‌త్రికి తీసుకెళ్లారు. కానీ అప్ప‌టికే ఇమ్రాన్ ప‌టేల్ మృతిచెందిన‌ట్లు డాక్ట‌ర్లు నిర్ధారించారు. మ్యాచ్‌ను లైవ్ స్ట్రీమ్ చేస్తున్న నేప‌థ్యంలో.. ఆ ఘ‌ట‌న కెమెరాల‌కు చిక్కింది. బ్యాట‌ర్ ఇమ్రాన్ ప‌టేల్ కింద‌ప‌డిపోగానే, ప్లేయ‌ర్లు అంద‌రూ అత‌ని వైపు ప‌రుగులు తీశారు.

గుండెపోటుతో మృతిచెందిన ఇమ్రాన్‌కు ఎటువంటి ఆరోగ్య స‌మ‌స్య‌లు లేవ‌ని తోటి జ‌ట్టు స‌భ్యులు వెల్ల‌డించారు. ఆల్‌రౌండ‌ర్ అయిన అత‌ను చాలా ఫిట్‌గా ఉంటాడ‌ని తెలిపారు. ఏ కార‌ణం చేత అత‌నికి కార్డియాక్ అరెస్టు అయిన‌ట్లు స్ప‌ష్టంగా తెలియ‌దు. ఇమ్రాన్ ప‌టేల్‌కు భార్య‌, ముగ్గురు కూతుళ్లు ఉన్నారు. ఇమ్రాన్‌కు త‌న ఏరియాలో మంచి గుర్తింపు ఉన్న‌ది. అత‌నికి ఓ క్రికెట్ జ‌ట్టు ఉన్న‌ది. రియ‌ల్ ఎస్టేట్ బిజినెస్‌లో కూడా ఉన్నాడ‌త‌ను. ఓ జ్యూష్ షాపును కూడా న‌డిపిస్తున్నాడు.

2024-11-29T06:56:58Z