BCCI : భారత జట్టును విశ్వ విజేతగా నిలిపిన రోహిత్ శర్మ (Rohit Sharma) దిగ్గజ కెప్టెన్ అనిపించుకున్నాడు. లెజెండరీ క్రికెటర్లు కపిల్ దేవ్ (Kapil Dev), ఎంఎస్ ధోనీ (MS Dhoni)ల తర్వాత టీమిండియా ఐసీసీ ట్రోఫీ కల నిజం చేసిన సారథిగా రికార్డుల్లోకెక్కాడు. జగజ్జేతగా సర్వత్రా ప్రశంసలు అందుకున్న 37 ఏండ్ల హిట్‌మ్యాన్ గురించి బీసీసీఐ సెక్రటరీ జై షా (Jai Shah) ఆసక్తికర విషయం వెల్లడించాడు.
మరో రెండు ఐసీసీ టోర్నీల్లోనూ రోహిత్ కెప్టెన్సీ చేయనున్నాడని ఆదివారం షా వెల్లడించాడు. వచ్చే ఏడాది జరుగబోయే ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్, చాంపియన్స్ ట్రోఫీలో భారత జట్టు రోహిత్ సారథ్యంలో బరిలోకి దిగుతుందని షా అన్నాడు. ‘రోహిత్ కెప్టెన్సీలో టీమిండియా డబ్ల్యూటీసీ, చాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో గెలుస్తుందని నాకు నమ్మకం ఉంది’ అని షా తెలిపాడు.
విరాట్ కోహ్లీ తర్వాత టీమిండియా పగ్గాలు అందుకున్న రోహిత్ అనతికాలంలోనే జట్టుపై తన ముద్ర వేశాడు. హిట్‌మ్యాన్ సారథ్యంలో భారత జట్టు నిరుడు టెస్టు చాంపియన్‌షిప్, వన్డే వరల్డ్ కప్ ఫైనల్స్ ఆడింది. అయితే.. ఈ రెండు సందర్భాల్లోనూ రోహిత్ సేన ఆస్ట్రేలియా చేతిలో అనూహ్యంగా ఓడి ట్రోఫీ చేజార్చుకుంది. ముచ్చటగా మూడో ఐసీసీ ఫైనల్ ఆడిన టీమిండియా ఈసారి పట్టు వదల్లేదు.
కరీబియన్ గడ్డపై జరిగిన టీ20 వరల్డ్ కప్‌లో అజేయంగా టైటిల్ పోరుకు దూసుకెళ్లింది. బార్బడోస్‌లోని కెన్సింగ్‌టన్ ఓవల్‌లో ఆఖరి ఓవర్ వరకూ ఉత్కంఠ రేపిన మ్యాచ్‌లో 7 పరుగులతో గెలుపొందిన భారత జట్టు 13 ఏండ్ల ట్రోఫీ కలను సాకారం చేసుకుంది.