హోరాహోరీగా సెపక్‌తక్రా పోటీలు

  • 28 రాష్ర్టాల నుంచి 600 మంది క్రీడాకారులు

హనుమకొండ చౌరస్తా, జనవరి 10: జవహర్‌లాల్‌ నెహ్రూ స్టేడియం(జేఎన్‌ఎస్‌) వేదికగా 34 జాతీయ సీనియర్‌ సెపక్‌తక్రా పోటీలు శుక్రవారం అట్టహాసంగా మొదలయ్యాయి. ఈనెల 14వ తేదీ వరకు జరిగే ఈ పోటీల్లో దేశవ్యాప్తంగా 28 రాష్ర్టాలతో పాటు రెండు సర్వీస్‌ టీమ్‌లు(ఎస్‌ఎస్‌బీ, ఆలిండియా పోలీస్‌) బరిలో ఉన్నాయి. తొలి రోజు పురుషుల, మహిళల జట్ల మధ్య పోటీలు జరిగాయి.

పురుషుల విభాగంలో తెలంగాణ 0-3తో ఢిల్లీ చేతిలో ఓటమిపాలైంది. మిగతా మ్యాచ్‌ల్లో ఎస్‌ఎస్‌బీ 3-0తో మహారాష్ట్రపై, అసోం 2-1తో తమిళనాడుపై, మణిపూర్‌ 3-0తో ఉత్తరప్రదేశ్‌పై, మహారాష్ట్ర 2-1తో అసోంపై, మణిపూర్‌ 2-0తో తెలంగాణపై గెలిచి ముందంజ వేశాయి. మరోవైపు మహిళల కేటగిరీలో నాగాలాండ్‌ 2-1తో తెలంగాణపై, ఎస్‌ఎస్‌బీ 3-0తో ఉత్తరప్రదేశ్‌పై, బీహార్‌ 2-1తో అసోంపై, ఎస్‌ఎస్‌బీ 3-0తో బీహార్‌పై, మణిపూర్‌ 3-0తో హర్యానాపై గెలిచాయి.

కేవలం కాళ్లు, తలతో ఆడే సెపక్‌తక్రా ఆట ఆద్యంతం అందరినీ ఉత్సాహపరిచింది. ప్రారంభ కార్యక్రమంలో రాష్ట్ర సెపక్‌తక్రా అసోసియేషన్‌ అధ్యక్షుడు సురేశ్‌కుమార్‌, కార్యదర్శి శ్రీనివాస్‌రెడ్డి, చైర్మన్‌ హనుమాండ్లరెడ్డి, ప్రేమ్‌రాజ్‌ పాల్గొన్నారు.

2025-01-10T21:16:08Z