వరల్డ్‌కప్ విజయంపై విమర్శలు.. వాన్‌కు దిమ్మదిరికే కౌంటర్ ఇచ్చిన రవిశాస్త్రి

టీ20 ప్రపంచకప్ 2024 నిర్వహణపై ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ మైకెల్ వాన్ చేసిన వ్యాఖ్యలపై టీమిండియా దిగ్గజ క్రికెటర్, మాజీ కోచ్ రవిశాస్త్రి మండిపడ్డాడు. ఈ టోర్నీ నిర్వహణ మొత్తం భారత్‌కు అనుకూలంగా ఉందని.. అందుకే టీమిండియా విజయం సాధించిందనేలా.. వాన్ కామెంట్లు చేశాడు. వరల్డ్ కప్ టోర్నమెంట్ షెడ్యూల్‌ను ప్రస్తావిస్తూ.. మైకెల్ వాన్ తీవ్ర ఆరోపణలు చేశాడు. టీమిండియాకు అనుకూలంగా నిర్వాహకులు వ్యవహరించారని అన్నాడు. దీనిపై రవిశాస్త్రి గట్టి కౌంటర్ ఇచ్చాడు.

టీ20 ప్రపంచకప్ తొలి సెమీ ఫైనల్‌లో దక్షిణాఫ్రికా, అఫ్ఘానిస్థాన్ జట్లు తలపడ్డ విషయం తెలిసిందే. అయితే ఈ టోర్నీ ఆసాంతం అద్భుత ప్రదర్శన చేసిన అప్ఘానిస్థాన్.. సెమీస్‌లో మాత్రం తేలిపోయింది. దక్షిణాఫ్రికా చేతిలో చిత్తుగా ఓడిపోయింది. ఈ నేపథ్యంలో టోర్నమెంట్ షెడ్యూల్‌ గురించి ప్రస్తావిస్తూ.. అఫ్ఘానిస్థాన్ ప్లేయర్లు సెమీ ఫైనల్ కోసం ట్రినిడాడ్ వెళ్లాల్సిన ఫ్లైట్ 4 గంటలు ఆలస్యమైందని.. దీంతో వారికి ప్రాక్టీస్ చేసుకునేందుకు సమయం లేకుండా పోయిందని మైకెల్ వాన్ అన్నాడు. భారత్‌కు అనుకూలమైన షెడ్యూల్‌ను ఐసీసీ తయారు చేయడంతోనే ఇది జరిగిందని ఆరోపించాడు.

ఈ వ్యాఖ్యలపై రవిశాస్త్రి గట్టిగా బదులిచ్చాడు. తనదైన శైలిలో మాటల తూటాలు పేల్చాడు. ‘మైకెల్ వాన్ నోటికొచ్చినట్లు మాట్లాడతాడు. అతడి మాటలను భారత్‌లో ఎవరూ కూడా పట్టించుకోరు. అతడు తన సొంత దేశ జట్టు అయిన ఇంగ్లాండ్ టీ20 ప్రపంచకప్ సెమీ ఫైనల్‌లో ఎందుకు విఫలమైంది? అనే విషయంపై దృష్టి సారిస్తే బాగుంటుంది. టీమిండియా నాలుగు ప్రపంచకప్ ట్రోఫీలు సాధించింది. ఇంగ్లాండ్ జట్టు రెండు సార్లు గెలిచింది. కానీ, మైకెల్ వాన్ ఒక్కసారి కూడా ప్రపంచకప్ సాధించలేదు’ అని రవిశాస్త్రి ఘాటుగా కౌంటర్ ఇచ్చాడు.

టీ20 ప్రపంచకప్ 2024 టైటిల్‌ను భారత్ సొంతం చేసుకుంది. ఓటమి అనేదే లేకుండా ట్రోఫీని ముద్దాడిని తొలి జట్టుగా భారత్ అవతరించింది. లీగ్ దశ, సూపర్-8ను అగ్రస్థానంతో ముగించి సెమీఫైనల్ చేరింది. సెమీ ఫైనల్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లాండ్‌ను ఓడించింది. దీంతో 2022 టీ20 ప్రపంచకప్‌లో ఓటమికి బదులు తీర్చుకుంది. ఈ మ్యాచులో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్.. 171/7 పరుగులు చేసింది. అనంతరం ఇంగ్లాండ్‌ను 103 పరుగులకు కుప్పకూల్చింది. దీంతో రివేంజ్ తీర్చుకుంది.

ఫైనల్‌లో దక్షిణాఫ్రికాను ఏడు పరుగుల తేడాతో చిత్తు చేసింది. చివరి ఓవర్లో దక్షిణాఫ్రికా విజయానికి 16 పరుగులు అవసరం కాగా.. పాండ్యా అద్భుత బౌలింగ్‌తో ప్రత్యర్థిని కట్టడి చేశాడు. 17 ఏళ్ల తర్వాత టీ20 ప్రపంచకప్ టైటిల్‌ను ముద్దాడింది. 11 ఏళ్లుగా కొనసాగుతున్న ఐసీసీ ట్రోఫీ నిరీక్షణకు తెరదించింది.

ఇటువంటి మరిన్ని వార్తలు సమయం తెలుగులో చదవండి. లేటెస్ట్ వార్తలు, సిటీ వార్తలు, జాతీయ వార్తలు, బిజినెస్ వార్తలు, క్రీడా వార్తలు, రాశిఫలాలు ఇంకా లైఫ్‌స్టైల్ అప్‌డేట్లు మొదలగునవి తెలుసుకోండి. వీడియోలను TimesXP లో చూడండి.

2024-07-06T16:53:13Z dg43tfdfdgfd