వరల్డ్ కప్ జ్ఞాపకాన్ని మర్చిపోని రోహిత్‌ శర్మ.. ప్రొఫైల్‌ పిక్‌గా ఆ 'మెమోరబుల్ ఫొటో'

తన సారథ్యంలో భారత జట్టుకు ఐసీసీ ట్రోఫీని అందించాలని కలలుగన్న టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ టీ20 ప్రపంచకప్‌ 2024 పుణ్యమా అని తన కోరికను నెరవేర్చుకున్నాడు. 17 ఏళ్ల తర్వాత భారత్‌కు టీ20 ప్రపంచకప్‌ టైటిల్‌ను అందించాడు. వన్డే ప్రపంచకప్‌ 2023 ఫైనల్‌లో ఓటమితో నిరాశ చెందిన హిట్‌మ్యాన్‌.. టీ20 ప్రపంచకప్‌ టైటిల్‌ సాధించడంపై భావోద్వేగానికి గురయ్యాడు. ఫైనల్‌లో హార్దిక్ పాండ్యా చివరి బంతి వేయడం, టీమిండియా గెలుపు ఖాయం కావడంతో గ్రౌండ్‌లో ఉన్నచోట బోర్లా పడిపోయాడు. చేతులను గ్రౌండ్‌పై కొడుతూ భావోద్వేగానికి గురయ్యాడు. భారత్‌కు ట్రోఫీని అందించి 140 కోట్ల భారతీయులను సంతోషంలో ముంచెత్తాడు.

కాగా ఫైనల్‌ మ్యాచ్‌ తర్వాత రోహిత్ శర్మ కన్నీరు పెట్టుకున్నాడు. ఇవి బాధ వల్ల వచ్చినవి కావు. గెలిచామనే సంతోషంతో వచ్చిన ఆనంద భాష్పాలు. డ్రెస్సింగ్‌రూమ్‌కు వెళ్తూ.. విరాట్ కోహ్లీని హగ్‌ చేసుకున్నాడు. మనం సాధించాం అన్నట్లుగా సిగ్నల్‌ ఇచ్చాడు. టీమిండియా కప్పు గెలిచిన తర్వాత రోహిత్ శర్మ.. బార్బడోస్‌ మైదానంలో భారత జెండాను పాతాడు. ఈ ఫొటో, వీడియో అప్పట్లో వైరల్‌గా మారింది. ఈ నేపథ్యంలో తాజాగా హిట్‌మ్యాన్‌ ఆ ఫొటోను తన ట్విట్టర్‌ ఖాతాలో ప్రొఫెల్‌ పిక్‌గా మార్చాడు. బార్బడోస్ గడ్డపై భారత జెండాను రోహిత్ పాతుతున్నట్లుగా ఉన్న ఫొటోను డీపీగా పెట్టుకున్నాడు. త‌న కెప్టెన్సీలో భారత జట్టు ఐసీసీ ట్రోఫీ గెలిచిన సంద‌ర్భాన్ని రోహిత్ ఇలా జీవితకాల జ్ఞాప‌కంగా మ‌లుచుకున్నాడు.

37 ఏళ్ల రోహిత్ శర్మ భారత్‌కు ఐసీసీ ట్రోఫీ అందించి దిగ్గజాల సరసన చేరిపోయాడు. కపిల్‌ దేవ్‌, మహేంద్ర సింగ్‌ ధోనీల సరసన చేరిపోయాడు. భారత్‌కు ఐసీసీ ప్రపంచకప్‌ ట్రోఫీ అందించిన మూడో కెప్టెన్‌గా రికార్డులకెక్కాడు. కాగా టీ20 ప్రపంచకప్‌ ఫైనల్‌ తర్వాత రోహిత్ శర్మ అంతర్జాతీయ టీ20 క్రికెట్‌కు గుడ్‌బై చెప్పాడు. కుర్రాళ్లకు అవకాశం ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పాడు. ఒక ఆటగాడిగా ఈ ఫార్మాట్‌కు వీడ్కోలు పలికేందుకు ఇంతకంటే మంచి సమయం ఉండదని చెప్పుకొచ్చాడు.

కాగా రోహిత్ శర్మ సారథ్యంలో భారత్‌ వరుసగా మూడు ఐసీసీ ఫైనల్స్‌ చేరింది. ప్రపంచ టెస్టు ఛాంపియన్‌ షిప్‌ 2023, వన్డే ప్రపంచకప్‌ 2023 పైనల్స్‌ చేరింది. ఆ రెండు మ్యాచుల్లోనూ ఆస్ట్రేలియా చేతిలో ఓడిపోయింది. కానీ టీ20 ప్రపంచకప్‌ 2024 ఫైనల్స్‌లో మాత్రం విజయఢంకా మోగించింది. రోహిత్‌ శర్మ టీ20లకు గుడ్‌బై చెప్పినా.. వన్డే, టెస్టు ఫార్మాట్‌లలో కొనసాగనున్నాడు.

ఈ మేరకు ఇటీవల మాట్లాడిన బీసీసీఐ కార్యదర్శి జైషా.. వన్డే, టెస్టు ఫార్మాట్లలో రోహిత్ భారత్‌కు నాయకత్వం వహిస్తాడని వెల్లడించాడు. అతడి సారథ్యంలోనే భారత్‌ ప్రపంచ టెస్టు ఛాంపియన్‌ షిప్‌, ఛాంపియన్స్ ట్రోఫీ గెలుస్తుంది ధీమా వ్యక్తం చేశాడు.

ఇటువంటి మరిన్ని వార్తలు సమయం తెలుగులో చదవండి. లేటెస్ట్ వార్తలు, సిటీ వార్తలు, జాతీయ వార్తలు, బిజినెస్ వార్తలు, క్రీడా వార్తలు, రాశిఫలాలు ఇంకా లైఫ్‌స్టైల్ అప్‌డేట్లు మొదలగునవి తెలుసుకోండి. వీడియోలను TimesXP లో చూడండి.

2024-07-08T16:46:08Z dg43tfdfdgfd