రిటైర్మెంట్‌పై యూటర్న్‌.. మళ్లీ ఆస్ట్రేలియా తరఫున ఆడే ఆలోచనలో వార్నర్‌..!

టీ20 ప్రపంచకప్‌ 2024తో అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పిన ఆస్ట్రేలియా విధ్వంసకర ఓపెనర్‌ డేవిడ్‌ వార్నర్‌ మనసు మార్చుకున్నట్లు తెలుస్తోంది. మళ్లీ ఆస్ట్రేలియా తరఫున ఆడాలని వార్నర్‌ భావిస్తున్నట్లు విశ్వసినీయ వర్గాలు తెలిపాయి. జాతీయ జట్టుకు అవసరమైతే.. పాకిస్థాన్‌ వేదికగా జరిగే ఛాంపియన్స్‌ ట్రోఫీ 2025కి అందుబాటులో ఉంటానని వార్నర్‌ తన సన్నిహితుల వద్ద చెప్పినట్లు తెలుస్తోంది. ఒకవేళ ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు తనను ఎంపిక చేస్తే కచ్చితంగా ఆడతానని చెప్పినట్లు సమాచారం. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

కాగా 37 ఏళ్ల డేవిడ్‌ వార్నర్‌.. ఇటీవల ముగిసిన టీ20 ప్రపంచకప్‌ 2024తో అంతర్జాతీయ కెరీర్‌కు గుడ్‌బై చెప్పాడు. ఈ ఏడాది జనవరి 1న వన్డేలకు.. జనవరి 10న టెస్టులకు వీడ్కోలు పలికాడు. టీ20 ప్రపంచకప్‌ 2024 తర్వాత అంతర్జాతీయ క్రికెట్‌ నుంచి తప్పుకుంటానని చెప్పుకొచ్చాడు. నా వారసుడు ఇతడే అన్నట్లుగా ఆస్ట్రేలియా యంగ్ బ్యాటర్‌ జేక్‌ ఫ్రెజర్‌ మెక్‌ గుర్క్‌తో కూడిన ఫొటోను సోషల్‌ మీడియాలో పోస్టు చేశాడు. కుటుంబానికి సమయం ఇవ్వాలని, ప్రపంచ వ్యాప్తంగా జరుగుతున్న లీగ్‌లకు అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతో రిటైర్మెంట్‌ తీసుకోవాలని భావిస్తున్నట్లు గతంలో వార్నర్‌ చెప్పాడు. దీంతో టీ20 ప్రపంచకప్‌తో అతడి అంతర్జాతీయ కెరీర్‌ ముగిసిందని అంతా భావించారు. కానీ అనూహ్యంగా వార్నర్‌ తన నిర్ణయాన్ని మార్చుకోవాలని చూస్తున్నట్లు తెలుస్తోంది.

కాగా టీ20 ప్రపంచకప్‌ 2024లో ఆస్ట్రేలియా సూపర్‌-8 దశ నుంచే నిష్క్రమించింది. అఫ్ఘానిస్థాన్‌, భారత్‌ చేతిలో ఓడిపోవడంతో ఆ జట్టు సెమీ ఫైనల్‌ చేరకుండానే ఇంటి బాట పట్టింది. దీంతో టైటిల్‌ సాధించి అంతర్జాతీయ కెరీర్‌కు గుడ్‌బై చెప్పాలన్న వార్నర్‌ కోరిక నెరవేరలేదు. కానీ వచ్చే రెండు నెలల పాటు ఆస్ట్రేలియాకు అంతర్జాతీయ మ్యాచ్‌లు లేవు. సెప్టెంబర్‌లో ఇంగ్లాండ్‌తో టెస్టు సిరీస్‌ ఉంది. వచ్చే ఏడాది పాకిస్థాన్ వేదికగా ఛాంపియన్స్ ట్రోఫీ జరగనుంది.

అంతర్జాతీయ జట్టు తరఫున రీఎంట్రీ ఇచ్చేందుకు వార్నర్‌ సిద్ధంగా ఉన్నా అతడిని జట్టులోకి తీసుకునే పరిస్థితులు కన్పించడం లేదు. దీర్ఘకాలిక ప్రణాళికల దృష్ట్యా యువ ఆటగాళ్లనే జట్టులోకి తీసుకునే ఛాన్స్ ఉంది. జేక్ ఫ్రెజర్‌ మెక్‌ గుర్క్‌ లాంటి యువ ప్లేయర్‌.. సత్తా చాటుతుండటంతో వార్నర్‌ తనకు ఇష్టం ఉన్నా లేకపోయినా.. అంతర్జాతీయ కెరీర్‌కు గుడ్‌బై చెప్పక తప్పదనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి. మరి ఛాంపియన్స్‌ ట్రోఫీకి అందుబాటులో ఉంటానన్న డేవిడ్ వార్నర్‌ మాటను ఆస్ట్రేలియా క్రికెట్‌ బోర్డు పరిగణలోకి తీసుకుంటుందా? ఛాంపియన్స్‌ ట్రోఫీకి ఎంపిక చేస్తుందా? అన్నదే తేలాల్సి ఉంది.

ఇటువంటి మరిన్ని వార్తలు సమయం తెలుగులో చదవండి. లేటెస్ట్ వార్తలు, సిటీ వార్తలు, జాతీయ వార్తలు, బిజినెస్ వార్తలు, క్రీడా వార్తలు, రాశిఫలాలు ఇంకా లైఫ్‌స్టైల్ అప్‌డేట్లు మొదలగునవి తెలుసుకోండి. వీడియోలను TimesXP లో చూడండి.

2024-07-08T17:16:12Z dg43tfdfdgfd