మీరేనా కోహ్లీ, రోహిత్‌‌ శర్మ వారసులు.. ఓటమిపై రియాక్షన్

టీ20 ప్రపంచకప్ 2024లో ఛాంపియన్‌గా నిలిచిన భారత జట్టు.. ఈ టోర్నీ తర్వాత జరిగిన తన తొలి టీ20 మ్యాచులో ఓడిపోయింది. అది కూడా జింబాబ్వే లాంటి చిన్నజట్టుపై. దీంతో భారత జట్టు ప్రదర్శనపై విమర్శలు వస్తున్నాయి. జింబాబ్వే లాంటి చిన్నజట్టుపై ఓడిపోతారా అంటూ నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మీరేనా కోహ్లీ, రోహిత్ శర్మకు వారసులు అని సందేహం వ్యక్తం చేస్తున్నారు.

కాగా టీ20 ప్రపంచకప్ 2024లో భారత్ విజేతగా నిలిచిన విషయం తెలిసింది. ఈ విజయం తర్వాత అంతర్జాతీయ టీ20ల నుంచి విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, రవీంద్ర జడేజాలు తప్పుకున్నారు. ఇకపై వన్డేలు, టెస్టులు మాత్రమే ఆడతామని చెప్పుకొచ్చారు. యువకులకు అవకాశం ఇచ్చేందుకే తాము ఈ నిర్ణయం తీసుకున్నామని వెల్లడించారు. టీమిండియా ఫ్యాన్స్ సైతం.. కోహ్లీ, రోహిత్‌లు సరైన నిర్ణయమే తీసుకున్నారని.. వారి వారసత్వాన్ని యువ ప్లేయర్లు కొనసాగిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు.

సీన్ కట్ చేస్తే..

సీనియర్ల గైర్హాజరీతో జింబాబ్వే గడ్డపై అడుగుపెట్టింది యువ భారత్. అయితే ఐపీఎల్‌లో అదరగొట్టిన యంగ్ ప్లేయర్లు ఉండటంతో భారత జట్టు బలంగా ఉందనే విశ్లేషణలు వినిపించాయి. టీ20 ప్రపంచకప్ 2026 కోసం కుర్రాళ్లను గుర్తించేందుకు ఈ సిరీస్ మంచి ఆరంభం అవుతుందని అంతా భావించారు. కానీ హరారే వేదికగా జరిగిన తొలి టీ20లో భారత్.. జింబాబ్వే చేతిలో పరాజయం పాలైంది. 116 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేక చతికిలపడింది. 102 పరుగులకే కుప్పకూలి 13 పరుగుల తేడాతో ఓడిపోయింది.

భారీ ఆశలు పెట్టుకున్న అభిషేక్ శర్మ (0), రుతురాజ్ గైక్వాడ్ (7), రియాన్ పరాగ్ (2), రింకూ సింగ్(0), ధ్రువ్ జురెల్‌ (6)లు ఘోరంగా విఫలమయ్యారు. టీమిండియా ఓటమికి కారణమయ్యారు. ఈ నేపథ్యంలో వీరిపై నెట్టింట ట్రోల్స్ మొదలయ్యాయి. వీరిపై నమ్మకంతోనే టీ20లకు రిటైర్మెంట్ ప్రకటించి తప్పు పని చేశారు కోహ్లీ, రోహిత్ భాయ్.. అని కామెంట్లు చేస్తున్నారు. ఇందుకు సంబంధించిన మీమ్స్‌తో సోషల్ మీడియో హోరెత్తిపోతోంది.

యువ భారత్ ప్రదర్శనను చూసి.. కోహ్లీ, రోహిత్‌లు నవ్వుకుంటున్నారని కామెంట్లు చేస్తున్నారు. రింకూ సింగ్‌ను టీ20 ప్రపంచకప్ 2024లో ఆడించాలని అడిగిన వారు ఇప్పుడు ఏం చెబుతారని ప్రశ్నిస్తున్నారు. వీళ్ల ఆటను చూస్తే టీ20 క్రికెట్‌లో భవిష్యత్‌లో భారత ప్రదర్శనపై ఆందోళన కలుగుతోందని కామెంట్లు చేస్తున్నారు. రిటైర్మెంట్‌ను వెనక్కి తీసుకుని.. రోహిత్, కోహ్లీలు తిరిగి టీ20 క్రికెట్‌లోకి అడుగుపెట్టాలని పోస్టులు పెడుతున్నారు.

మరికొందరేమో కొంచెం ఓపిక పట్టండి. కుర్రాళ్ల సత్తా ఏంటో తర్వాతి మ్యాచుల్లో చూస్తారంటూ పేర్కొంటున్నారు.

ఇటువంటి మరిన్ని వార్తలు సమయం తెలుగులో చదవండి. లేటెస్ట్ వార్తలు, సిటీ వార్తలు, జాతీయ వార్తలు, బిజినెస్ వార్తలు, క్రీడా వార్తలు, రాశిఫలాలు ఇంకా లైఫ్‌స్టైల్ అప్‌డేట్లు మొదలగునవి తెలుసుకోండి. వీడియోలను TimesXP లో చూడండి.

2024-07-06T18:23:27Z dg43tfdfdgfd