భారత జట్టుకు మహారాష్ట్ర ప్రభుత్వం రూ.11 కోట్ల నజరానా

17 ఏళ్ల తర్వాత టీ20 ప్రపంచకప్‌ టైటిల్‌ సాధించిన టీమిండియాకు మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్‌ షిండే భారీ నజరానా ప్రకటించారు. రూ. 11 కోట్ల ప్రైజ్‌మనీని అందజేయనున్నట్లు వెల్లడించారు. టైటిల్‌ గెలిచిన భారత జట్టులో ఉన్న ముంబై ప్లేయర్లు కెప్టెన్‌ రోహిత్ శ‌ర్మ‌, సూర్యకుమార్ యాదవ్, యశస్వి జైస్వాల్, శివ‌మ్ దూబేలను ఆయన సత్కరించారు. శుక్రవారం ఈ నలుగురిని విధాన్ భవన్ సెంట్రల్ హాల్‌లో సీఎం ఏక్‌నాథ్ షిండే స‌న్మానించారు. ఈ కార్యక్రమంలో ప్లేయర్లతో పాటు భారత బౌలింగ్‌ కోచ్‌ పరాస్ మాంబ్రే, సహాయక సిబ్బంది అరుణ్ ఖాడే కూడా ఉన్నారు.

ఈ సన్మాన కార్యక్రమంలో టీమిండియా క్రికెటర్ల ఆటతీరును షిండే కొనియాడారు. ముఖ్యంగా సూర్యకుమార్‌ యాదవ్‌ పట్టిన క్యాచ్‌పై ప్రశంసలు కురిపించారు. సూర్య అద్భుతంగా క్యాచ్‌ను అందుకున్నాడని కొనియాడాడు. ఇదే సమయంలో టీమిండియా విజయోత్సవ ర్యాలీని విజయవంతం చేసిన ముంబై పోలీసులను సైతం మహారాష్ట్ర సీఎం అభినందించారు. అనంతరం ప్ర‌పంచక‌ప్ జ‌ట్టులోని ముంబై ఆట‌గాళ్లను ఆయ‌న త‌న నివాసానికి ఆహ్వానించారు. అక్కడ కెప్టెన్ రోహిత్ శ‌ర్మ‌తో పాటు సూర్య‌కుమార్ యాద‌వ్, శివమ్‌ దూబే, య‌శ‌స్వి జైస్వాల్‌లకు శాలువా క‌ప్పి స‌న్మానించారు. వినాయ‌కుడి విగ్ర‌హాన్ని బ‌హుమ‌తిగా ఇచ్చారు. భార‌త క్రికెటర్ల‌ను షిండే స‌న్మానించిన వీడియోను మహారాష్ట్ర సీఎంఓ ట్విట్టర్‌లో పంచుకుంది.

కాగా టీ20 ప్రపంచకప్‌ గెలిచిన భారత జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) కూడా ఘనంగా సత్కరించిన విషయం తెలిసిందే. టైటిల్‌ సాధించిన అనంతరం రూ. 125 కోట్లు ప్రైజ్‌మనీ ఇవ్వనున్నట్లు బీసీసీఐ కార్యదర్శి జైషా ప్రకటించారు. ఇచ్చిన మాట ప్రకారం ఆ మొత్తానికి సంబంధించిన చెక్కును అందజేశారు.

టీ20 ప్రపంచకప్‌ 2024 టైటిల్‌ గెలిచిన భారత్.. గురువారం ఉదయం భారత గడ్డపై అడుగుపెట్టింది. ఒక రోజంతా సంబురాలు జరుపుకుంది. తొలుత ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌లో టీమిండియాకు ఘన స్వాగతం లభించింది. ఆ తర్వాత ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో రోహిత్ శర్మ నేతృత్వంలోని భారత జట్టు భేటీ అయింది. ఆ తర్వాత అక్కడి నుంచి ముంబై చేరుకుంది. ముంబైలోని సముద్ర తీరం మీదుగా విజయోత్సవ ర్యాలీలో ఆటగాళ్లు పాల్గొన్నారు. ఓపెన్‌ టాప్‌ బస్సులో ఫ్యాన్స్‌కు అభివాదం చేస్తూ ముందుకెళ్లారు. చివరగా వాంఖడే స్టేడియంలో జరిగిన వేడుకలతో సంబురాలు ముగిశాయి. ఆ తర్వాత టీమిండియా ఆటగాళ్లు స్వస్థలాలకు వెళ్లిపోయారు. ఇందులో భాగంగానే ముంబైకి చెందిన రోహిత్, సూర్య, దూబె, జైశ్వాల్‌ను ఆ రాష్ట్ర ప్రభుత్వం సత్కరించింది.

ఇటువంటి మరిన్ని వార్తలు సమయం తెలుగులో చదవండి. లేటెస్ట్ వార్తలు, సిటీ వార్తలు, జాతీయ వార్తలు, బిజినెస్ వార్తలు, క్రీడా వార్తలు, రాశిఫలాలు ఇంకా లైఫ్‌స్టైల్ అప్‌డేట్లు మొదలగునవి తెలుసుకోండి. వీడియోలను TimesXP లో చూడండి.

2024-07-05T17:34:20Z