నన్నెవరూ అర్థం చేసుకోలేదు.. డిప్రెషన్లోకి వెళ్లిపోయా: ఇషాన్ కిషన్

టీమిండియా యువ క్రికెటర్‌ ఇషాన్ కిషన్‌కు బీసీసీఐ కొంత కాలం క్రితం షాక్ ఇచ్చిన విషయం తెలిసిందే. సెంట్రల్ కాంట్రాక్టు నుంచి తప్పించడంతోపాటు.. తుది జట్టులోనూ చోటు కల్పించలేదు. దీంతో బెంచీకే పరిమితం అవుతున్నాననే అసహనంతో అతడు దక్షిణాఫ్రికా పర్యటన నుంచి వచ్చాడని గుసగుసలు వినిపించాయి. పైగా దేశవాళీ క్రికెట్ ఆడమని బీసీసీఐ చెప్పినా.. ఇషాన్ వినిపించుకోలేదని, ఐపీఎల్ కోసం సిద్ధమయ్యాడనే కథనాలు వచ్చాయి. అందుకే అతడిని భారత జట్టు నుంచి తప్పించారని విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. అయితే ఈ విషయంపై ఇషాన్ కిషన్ తొలిసారి స్పందించాడు. ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలు వెల్లడించాడు.

డిప్రెషన్‌కు గురయ్యా..

‘‘అది చాలా క్లిష్ట సమయం. బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్టు నుంచి తప్పించడం నిరుత్సాహానికి గురి చేసింది. నన్ను చాలా మంది అడుగుతున్నారు.. ఏమైంది? ఏం జరిగింది? అని.. కానీ నేను ఎక్కువగా ప్రయాణాలు చేయడంతో కుంగుబాటుకు గురయ్యా. ఒక రకమైన డిప్రెషన్‌లోకి వెళ్లిపోయా. నాకే ఎందుకు ఇలా జరుగుతోంది? అని బాధపడేవాడిని. ఏదో తేడాగా జరుగుతోందని అనిపించింది. దీంతో ఆటకు విరామం తీసుకోవాలని భావించా. కానీ నన్ను తప్పుగా అర్థం చేసుకున్నారు. నా కుటుంబ సభ్యులు, క్లోజ్ ఫ్రెండ్స్ తప్ప మిగతా వారు నన్ను అర్థం చేసుకోలేదు’’ అని 25 ఏళ్ల ఇషాన్ కిషన్ అన్నాడు.

దేశవాళీ క్రికెట్ ఆడమనడం కరెక్టేనా?

‘‘గత ఆరు నెలలుగా మానసిక ఒత్తిడికి గురయ్యా. నేను భారీగా పరుగులు చేస్తున్నప్పుడే ఇది జరిగింది. పరుగులు చేస్తున్నా సరే.. ఎక్కువగా బెంచ్‌పై కూర్చోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. కానీ జట్టుగా ఉన్నప్పుడు ఇలాంటివి తప్పదు. ఇది కూడా నేను విరామం తీసుకునేందుకు కారణమైంది. ఆటకు బ్రేక్ తీసుకోవడం అనేది సాధారణంగా జరిగే ప్రక్రియ. కానీ మళ్లీ జట్టులోకి రావాలంటే దేశవాళీ క్రికెట్‌ ఆడాలనే నిబంధన ఉంది. కానీ నా సమస్య భిన్నమైంది. దేశవాళీ క్రికెట్‌లో నన్ను ఆడమనడం నాకు సమంజసం అనిపించలేదు. మానసిక ఒత్తిడికి గురై.. క్రికెట్ ఆడలేని పరిస్థితుల్లోనే భారత్ తరఫున మ్యాచులు ఆడకుండా బ్రేక్ తీసుకున్నా. అలాంటప్పుడు దేశవాళీలో ఆడమనడం సరైందేనా? నేను మెంటల్‌గా ఫిట్‌గా ఉంటే టీమిండియాకే ఆడేవాడిని కదా?’’ అని ఇషాన్ వ్యాఖ్యానించాడు.

అన్ని ఫార్మాట్‌లు ఆడతా..

‘‘నేను మూడు ఫార్మాట్‌లు ఆడుతున్నా. టీ20, వన్డే, టెస్టుల్లో రాణించా. భారత జట్టు తరఫున మూడు ఫార్మాట్‌లలో ఆడాలని అనుకుంటున్నా. రిషభ్ పంత్ మళ్లీ బరిలోకి దిగడం ఆనందంగా ఉంది. క్వాలిటీ ప్లేయర్లతో పోటీ పడ్డప్పుడే కదా మనలోని అసలు ఆట బయటకు వస్తుంది. మనం మరింత మెరుగైన ఆటగాడిగా తయారవుతాం’’ అని ఇషాన్ పేర్కొన్నాడు.

సౌతాఫ్రికా సిరీస్, రంజీలు ఆడని ఇషాన్ కిషన్.. ఆ తర్వాత ఐపీఎల్‌లో మాత్రం ఆడాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో 14 ఇన్నింగ్స్ ఆడిన ఇషాన్.. 22.85 యావరేజ్‌, 148.83 స్ట్రైక్ రేట్‌తో 320 పరుగులు చేశాడు. ఐపీఎల్‌లో ఆకట్టుకోలేకపోవడంతో టీ20 వరల్డ్ కప్ కోసం ఎంపిక చేసిన జట్టులో అతడికి చోటు దక్కలేదు. వికెట్ కీపర్లు రిషభ్ పంత్, సంజూ శాంసన్‌లను బీసీసీఐ సెలక్టర్లు ఎంపిక చేశారు.

ఇటువంటి మరిన్ని వార్తలు సమయం తెలుగులో చదవండి. లేటెస్ట్ వార్తలు, సిటీ వార్తలు, జాతీయ వార్తలు, బిజినెస్ వార్తలు, క్రీడా వార్తలు, రాశిఫలాలు ఇంకా లైఫ్‌స్టైల్ అప్‌డేట్లు మొదలగునవి తెలుసుకోండి. వీడియోలను TimesXP లో చూడండి.

2024-07-08T05:14:13Z dg43tfdfdgfd