ధోనీ 43వ బర్త్‌డే స్పెషల్.. మహీ.. ది కెప్టెన్..!

మహేంద్ర సింగ్ ధోనీ.. ప్రపంచ క్రికెట్‌లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న వ్యక్తి. భారత క్రికెట్‌లో తనదైన ముద్ర వేసిన లెజెండ్. టీమిండియా క్రికెట్ గురించి చెప్పాలంటే ధోనీకి ముందు.. ధోనీకి తర్వాత.. అంతలా భారత క్రికెట్‌పై అతడు ప్రభావం చూపించాడు. అతడి రాక దేశంలో క్రికెట్‌కు కొత్త వెలుగును తీసుకొచ్చింది. టీమిండియాను ప్రపంచ క్రికెట్‌లో మేటి జట్టుగా నిలిపిన కెప్టెన్ ధోనీ. యువ ఆటగాళ్లతోనూ మైదానంలో అద్భుతాల సృష్టించడం అతడి నైజం. సాధారణ బౌలర్లతో కూడా అసాధారణ ప్రదర్శన రాబట్టడం అతడికి అలవాటు. వాస్తవానికి ధోనీ గురించి మాట్లాడుకోవాలంటే ఎంతైనా మాట్లాడుకోవచ్చు.. ఎంతైనా చెప్పుకొవచ్చు. మహేంద్ర సింగ్ ధోనీ 43వ పుట్టిరోజు సందర్భంగా స్పెషల్ స్టోరీ..

ధోనీ అరంగేట్రం..మహేంద్ర సింగ్ ధోనీ రాంచీలో 1981 జులై 7న జన్మించాడు. దేశవాళీ క్రికెట్‌లో సత్తాచాటి భారత జట్టుకు ఎంపికయ్యాడు. సౌరవ్ గంగూలీ సారథ్యంలో 2004 డిసెంబర్ 23న బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌తో భారత జట్టు తరఫున డెబ్యూ చేశాడు. ఆ మ్యాచ్‌లో ఒక బంతి మాత్రమే ఎదుర్కొన్న ఎంఎస్.. రనౌట్‌ అయి పెవిలియన్ చేరాడు. ఏ ఆటగాడికైనా తన కెరీర్‌లో టర్నింగ్ పాయింట్ అంటూ ఒకటి ఉంటుంది. ధోనీ కెరీర్‌లో అది 2005లో పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్. అప్పట్లో జులపాల జట్టుతో కన్పించే ధోనీ.. విశాఖపట్నం వేదికగా పాక్‌తో జరిగిన మ్యాచులో పెను విధ్వంసం సృష్టించాడు. 123 బంతుల్లో 148 పరుగులు చేశాడు. అదే సంవత్సరంలో శ్రీలంకతో జరిగిన వన్డేలో 145 బంతుల్లో 183 పరుగులు చేశాడు. ఇక అంతే.. ఆ ఇన్నింగ్స్ తర్వాత ధోనీ వెనక్కి తిరిగి చూసుకోలేదు.

టీమిండియా కెప్టెన్..ధోనీ కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టడం అనూహ్య పరిణామాల మధ్య జరిగింది. 2007 వన్డే ప్రపంచకప్‌లో రాహుల్ ద్రవిడ్ సారథ్యంలో భారత్ అనూహ్యంగా గ్రూప్ దశ నుంచే వెనుదిరిగింది. వాస్తవానికి అప్పట్లో టీ20 మ్యాచ్‌లకు బీసీసీఐ అంత ప్రాధాన్యత ఇచ్చేది కాదు. 2007లో జరిగిన తొలి టీ20 ప్రపంచకప్ కోసం జట్టును పంపించడానికి కూడా బీసీసీఐ సిద్ధంగా లేదు. కానీ ఐసీసీ విజ్ఞప్తి మేరకు జట్టును పంపాలని నిర్ణయించింది. అయితే అప్పటికే వన్డే ప్రపంచకప్‌లో దారుణ ప్రదర్శన చేసిన భారత జట్టును ప్రక్షాళన చేయాలని బీసీసీఐ భావించింది. దీంతో వీరేంద్ర సెహ్వాగ్, యువరాజ్ సింగ్, హర్భజన్ సింగ్ లాంటి సీనియర్లు ఉన్నా.. ధోనీనే సారథిగా నియమించింది. సచిన్ టెండూల్కర్ సూచనను అమలు చేసింది. సచిన్, ద్రవిడ్, గంగూలీ లాంటి సీనియర్లను టీ20 ప్రపంచకప్‌కు పక్కకు పెట్టింది. తనపై బీసీసీఐ ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టిన ధోనీ.. తొలిటోర్నీలోనే ఐసీసీ ట్రోఫీని అందించాడు.

మూడు ఐసీసీ ట్రోఫీలు..ఐసీసీ 3 పెద్ద ఈవెంట్లలో ట్రోఫీ అందుకున్న ఏకైక కెప్టెన్‌ మహేంద్ర సింగ్ ధోనీ. 2007లో ఐసీసీ టీ20 ప్రపంచకప్, 2011లో ఐసీసీ వన్డే ప్రపంచకప్, 2013లో ఐసీసీ ఛాంపియన్స్‌ ట్రోఫీని అతడి సారథ్యంలోనే భారత్ అందుకుంది. 2007 టీ20 ప్రపంచకప్‌లో ఫైనల్‌లో పాకిస్థాన్‌ను ఓడించి ట్రోఫీని గెలుచుకుంది. అనూహ్యంగా ఫైనల్ ఓవర్‌ను జోగీందర్ శర్మతో వేయించి అద్భుతం చేశాడు. రాత్రికి రాత్రే హీరో అయిపోయాడు. 2011 వన్డే ప్రపంచకప్‌ ఫైనల్‌లో శ్రీలంకపై విన్నింగ్ షాట్ కొట్టి టీమిండియాకు రెండో వన్డే ప్రపంచకప్‌ను అందించాడు. మినీ ప్రపంచకప్‌గా చెప్పుకునే ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీని కూడా ధోనీ టీమిండియాకు అందించాడు.

రిటైర్మెంట్ సాదాసీదాగా..రిటైర్మెంట్ సమయంలోనూ ధోనీ జట్టు గురించే అలోచించాడు. జట్టుకు కోహ్లీ రూపంలో తన వారసుడు దొరికాక మెళ్లిమెళ్లిగా కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పుకున్నాడు. 2014లో టెస్టులకు వీడ్కోలు పలికిన ధోనీ.. 2017లో వన్డే, టీ20 కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పుకున్నాడు. రెండు మూడేళ్ల పాటు ఆటగాడిగా జట్టులో ఉంటూ.. కెప్టెన్ విరాట్ కోహ్లీకి అండగా నిలబడ్డాడు. 2019 వన్డే ప్రపంచకప్ సెమీస్‌లో రనౌట్‌గా వెనుదిరిగిన మహీ.. మళ్లీ టీమిండియా జెర్సీ వేసుకుని గ్రౌండ్‌లోకి దిగలేదు. ఈ రనౌట్ తర్వాత ఏడాది పాటు క్రికెట్‌కు దూరమైన ధోనీ.. 2020 ఆగస్టు 15న రాత్రి 7.29 గంటలకు అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పాడు.

ఇక ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో మాత్రం ధోనీ ఆడుతున్నాడు. ఐపీఎల్-2024కు ముందు చెన్నై సూపర్ కింగ్స్ సారథ్య బాధ్యతల నుంచి తప్పుకున్నాడు. రుతురాజ్ గైక్వాడ్‌కు బాధ్యతలు అప్పగించి ఆటగాడిగా మాత్రమే కొనసాగాడు. ధోనీ ఐపీఎల్ 2025లో ఆడతాడా లేదా అన్న ప్రశ్నకు కాలమే సమాధానం చెప్పనుంది. భారతక్రికెట్‌లో చెరగని ముద్ర వేసిన ధోనీ.. ఇటువంటి మరెన్నో వేడుకలు జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. హ్యాపీ బర్త్ డే మహీ..!

ఇటువంటి మరిన్ని వార్తలు సమయం తెలుగులో చదవండి. లేటెస్ట్ వార్తలు, సిటీ వార్తలు, జాతీయ వార్తలు, బిజినెస్ వార్తలు, క్రీడా వార్తలు, రాశిఫలాలు ఇంకా లైఫ్‌స్టైల్ అప్‌డేట్లు మొదలగునవి తెలుసుకోండి. వీడియోలను TimesXP లో చూడండి.

2024-07-07T05:10:15Z