జింబాబ్వేపై ఓడిన భారత్.. తొలి టీ20లో పరాజయం

టీ20 ప్రపంచకప్‌లో ఛాంపియన్‌గా నిలిచిన భారత్.. ఆ తర్వాత జరిగిన తొలి సిరీస్‌ను ఓటమితో ప్రారంభించింది. పసికూన జింబాబ్వే చేతిలో 13 పరుగుల తేడాతో ఓడిపోయింది. జింబాబ్వేలోని హరారే వేదికగా జరిగిన తొలి మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన జింబాబ్వే నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 115 పరుగులు చేసింది. అనంతరం టీమిండియా 19.5 ఓవర్లలో 102 పరుగులకు ఆలౌట్ అయింది.

ఈ మ్యాచులో తొలుత బ్యాటింగ్ చేసిన జింబాబ్వే రెండో ఓవర్‌లోనే తొలి వికెట్ కోల్పోయింది. మకేశ్ కుమార్ తన తొలి బంతికే వికెట్ తీశాడు. ఆ తర్వాత జింబాబ్వే బ్యాటర్లు పోరాడారు. బ్రియాన్ బన్నెట్ (15 బంతుల్లో 22 రన్స్), సికిందర్ రాజా (19 బంతుల్లో 17 రన్స్) చేశారు. ఓ దశలో 90 పరుగులకే 9 వికెట్లు కోల్పోయిన జింబాబ్వే వంద పరుగుల లోపే ఆలౌట్ అయ్యేలా కనిపించింది. కానీ చివర్లో మదాండే (25 బంతుల్లో 29 రన్స్) పోరాడటంతో 115 పరుగులు చేసింది. భారత బౌలర్లలో రవి బిష్ణోయ్ 4, వాషింగ్టన్ సుందర్ 2, ముకేశ్ కుమార్ 1, ఆవేశ్ ఖాన్ 1 వికెట్ తీశారు.

అనంతరం 116 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్‌కు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. ఐపీఎల్‌లో సన్ రైజర్స్ తరఫున అదరగొట్టిన అభిషేక్ శర్మ డకౌట్ అయ్యాడు. ఆ తర్వాత వచ్చి రుతురాజ్ గైక్వాడ్ (7), రియాన్ పరాగ్ (2), రింకూ సింగ్ (0), ధ్రువ్ జురెల్(6)లు సైతం సింగిల్ డిజిట్‌కే పరిమితమయ్యారు. దీంతో 22 పరుగులకే 4 వికెట్లు కోల్పోయింది. కానీ కెప్టెన్ శుభ్‌మన్ గిల్(29 బంతుల్లో 31 రన్స్) పోరాడాడు. ఆ తర్వాత వాషింగ్టన్ సుందర్ (34 బంతుల్లో 27 రన్స్) భారత్‌ను గెలిపించేందుకు శాయశక్తులా ప్రయత్నించాడు. కానీ మిగతా బ్యాటర్లు తేలిపోవడంతో భారత్ 19.5 ఓవర్లలో 102 పరుగులకు ఆలౌట్ అయింది. 13 పరుగులు తేడాతో ఓడిపోయింది. ఈ విజ‌యంతో ఆతిథ్య జ‌ట్టు ఐదు మ్యాచ్‌ల‌ సిరీస్‌లో 1-0తో ఆధిక్యంలోకి దూసుకెళ్లింది.

ఇటువంటి మరిన్ని వార్తలు సమయం తెలుగులో చదవండి. లేటెస్ట్ వార్తలు, సిటీ వార్తలు, జాతీయ వార్తలు, బిజినెస్ వార్తలు, క్రీడా వార్తలు, రాశిఫలాలు ఇంకా లైఫ్‌స్టైల్ అప్‌డేట్లు మొదలగునవి తెలుసుకోండి. వీడియోలను TimesXP లో చూడండి.

2024-07-06T15:53:01Z