ఐపీఎల్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) ఫ్రాంఛైజీ గొప్ప నిర్ణయం తీసుకుంది. సుదీర్ఘకాలం ఆర్సీబీ (RCB) టీమ్‌కి ఆడిన ఏబీ డివిలియర్స్ (AB de Villiers), క్రిస్‌గేల్ (Chris Gayle)ని గౌరవిస్తూ ఈ ఇద్దరి జెర్సీ నెంబర్లకి రిటైర్మెంట్ ప్రకటించింది. ఐపీఎల్(IPL)లో ఏబీ డివిలియర్స్ జెర్సీ నెం.17ని ధరించగా.. క్రిస్‌గేల్ జెర్సీ నెం.333. వాస్తవానికి ఈ ఇద్దరూ ఆర్సీబీతో పాటు వేర్వేరు జట్లకి కూడా ఆడారు. కానీ.. ఆర్సీబీకి చిరస్మరణీయమైన విజయాల్ని అందించడంతో వారిని హాల్ ఆఫ్ ఫేమ్‌లోనూ ఫ్రాంఛైజీ చేర్చింది. ఇక 17, 333 జెర్సీ నెంబర్లని ఆర్సీబీ టీమ్‌లో ఎవరికీ కేటాయించరు.
2008 నుంచి ఐపీఎల్ జరుగుతుండగా.. 2011 నుంచి 2021 వరకూ ఆర్సీబీ తరఫున ఏబీ డివిలియర్స్ మ్యాచ్‌లు ఆడాడు. ఈ క్రమంలో 156 మ్యాచ్‌లాడి 4491 పరుగులు చేశాడు. ఇందులో 37 హాఫ్ సెంచరీలు, రెండు సెంచరీలు ఉన్నాయి. అత్యధిక స్కోరు 133 పరుగులు. అన్నింటికీ మించి విరాట్ కోహ్లీతో ఏబీడీకి మంచి అనుబంధం ఉంది. ఈ ఇద్దరూ కలిసి ఐదు సార్లు శతక భాగస్వామ్యం, రెండు సార్లు 200కిపైగా భాగస్వామ్యాల్ని నెలకొల్పారు. 2021లో క్రికెట్‌లోని అన్ని ఫార్మాట్లకీ ఏబీ డివిలియర్స్ రిటైర్మెంట్ ప్రకటించాడు. ఆర్సీబీ టీమ్ కంటే ముందు ఢిల్లీ జట్టుకి ఏబీడీ ఆడాడు.
వెస్టిండీస్ విధ్వంసక క్రికెటర్ క్రిస్‌గేల్ 2011 నుంచి 2017 వరకూ ఆర్సీబీ టీమ్‌కి ఆడాడు. 2013 సీజన్‌లో 16 మ్యాచ్‌ల్లోనే 708 పరుగులు చేసిన గేల్.. అదే ఏడాది 175 పరుగుల అత్యధిక స్కోరు కూడా నమోదు చేశాడు. వాస్తవానికి 2009లో కోల్‌కతా నైట్‌రైడర్స్ జట్టుకి గేల్ ఆడాడు. ఆ తర్వాత 2011లో ఆర్సీబీ టీమ్‌లోకి వచ్చాడు. అనంతరం 2018లో పంజాబ్ కింగ్స్ జట్టుకి మారాడు. కానీ.. 2021 తర్వాత ఐపీఎల్‌కి దూరంగా ఉండిపోయాడు.
2023-03-18T11:15:13Z dg43tfdfdgfd