ఆశ్రమంలో కోహ్లీ, అనుష్క.. ప్రేమానంద్‌ మహారాజ్‌ ఆశీర్వాదం తీసుకున్న దంపతులు

బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో ఆడేందుకు ఇటీవల ఆస్ట్రేలియాలో పర్యటించిన టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ భారత్‌లో అడుగుపెట్టాడు. భార్య అనుష్క శర్మ, పిల్లలు వామిక, అకాయ్‌‌తో కలిసి స్వదేశానికి చేరాడు. ఈ క్రమంలోనే తన కుటుంబంతో కలిసి ఉత్తర ప్రదేశ్‌లోని వృందావన్‌ ఆశ్రమాన్ని సందర్శించాడు. ప్రముఖ ఆధ్యాత్మిక గురువు ప్రేమానంద్ జీ మహరాజ్‌ను కలిసి ఆశీర్వచనాలు తీసుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి.ప్రేమానంద్ జీ మహరాజ్‌ను కలిసి కోహ్లీ దంపతులు ఈ సందర్భంగా ఆయనతో పలు విషయాలపై మాట్లాడారు. అనుష్క శర్మ మాట్లాడుతూ.. “గతంలో మేం ఇక్కడికి వచ్చినప్పుడు నా మనసులోని కొన్ని ప్రశ్నలు అడగలేకపోయే. అవి అలాగే ఉండిపోయాయి. కానీ, నేను మిమ్మల్ని అడగాలనుకున్న ప్రశ్నలు వేరే వాళ్లు అడిగేశారు. ఈసారి మాత్రం నా మనసులోని సందేహాలు కచ్చితంగా అడగాలని భావించా. కానీ, ఈసారి కూడా అదే పునరావృతం అయింది. ఇతరుల వల్ల నా ప్రశ్నలకు సమాధానం దొరికింది. మీ ఆశీస్సులు ఉంటే చాలు’ అని అన్నారు.విరాట్ కోహ్లీ, అనుష్క శర్మలు వచ్చి తన ముందు ప్రణమిల్లడం చూసి ప్రేమానంద్‌ జీ మహరాజ్‌ భావోద్వేగానికి గురయ్యారు. వారిని కొనియాడారు. “మీ ఇద్దరు చాలా ధైర్యవంతులు. ప్రపంచవ్యాప్తంగా కీర్తిప్రతిష్టలు సంపాదించిన తర్వాత కూడా దేవుడి పట్ల ఇంత అణకువగా ఉండటం అందరికీ సాధ్యమయ్యే విషయం కాదు. భక్తి విషయంలో అనుష్క ప్రభావమే కోహ్లీపై ఉందని మేం అనుకుంటున్నాం’ అని ఆయన అన్నారు.‘విరాట్‌ తన ఆటతో దేశాన్ని సంతోషంలో ఉంచుతాడు. అతడు రాణిస్తే.. దేశమంతా సంతోషంగా ఉంటుంది. అంతలా కోహ్లీని ప్రజలు ప్రేమిస్తున్నారు’ అని ప్రేమానంద్‌ జీ మహారాజ్‌ అన్నారు. కోహ్లీ దంపతులు తమ పిల్లల ఫొటోలను ఇప్పటివరకు బహిర్గతం చేయలేదు. తాజాగా వృందావన్‌ను వారు దర్శించుకున్న సమయంలో తీసిన వీడియోలను వారిద్దరి ముఖాలు కనిపించకుండా ఎడిట్ చేసి విడుదల చేశారు. ఈ వీడియోను ఆశ్రమ అధికారిక ఖాతా నుంచి పోస్టు చేశారు. ఇందులో వామిక, ఆకాయ్‌ల ముఖాలు కన్పించకుండా బ్లర్‌ వేశారు.

2025-01-10T15:06:16Z